రెండు రోజుల్లో 9 లక్షల 70వేల కోట్లు ఆవిరి.. యుద్ధంతో ఇన్వెస్టర్లు పరేషాన్

 రెండు రోజుల్లో 9 లక్షల 70వేల కోట్లు ఆవిరి.. యుద్ధంతో ఇన్వెస్టర్లు పరేషాన్

పశ్చిమాసియాలో యుద్ధంతో ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 1,700 పాయింట్ల మేర క్షీణించింది. నిఫ్టీ 24,400 దిగువన కదలాడుతోంది. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల 70వేల కోట్లకు పైగా ఆవిరైంది. ఇవాళ సెన్సెక్స్ 1,670 పాయింట్ల మేర పతనమై 78,565 వద్ద ఉంది. నిఫ్టీ 513 పాయింట్లు కోల్పోయి 24,351 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, ఓఎన్ జీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. లార్సెన్, టాటా స్టీల్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

మరో వైపు రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమయ్యింది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఒక్క రోజే 67 పైసులు క్షీణించి 92.17 వద్ద ఆల్ టైం లోకి చేరుకుంది. ఈ భారీ పతనానికి ప్రధానంగా ఇరాన్ అగ్రనేత ఖమేనీ మరణం తర్వాత పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగ తోడయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వేగంగా ఉపసంహరించుకోవడంతో బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. యుద్ధం గనుక మరి కొన్ని రోజులు కొనసాగితే మార్కెట్లు మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని.. ఇన్వెస్టర్లు ఆచితుడి అడుగు వేయాలని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మార్కెట్ల క్లోజింగ్ ఇలా..

స్టాక్ మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1122 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 385 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1085 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1255 పాయింట్లు కోల్పోయింది. ప్రధానంగా యుద్ధ భయాలతో పాటుగా విదేశీ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రూపాయి బలహీనత, విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవటం వంటి అంశాలు మార్కెట్లను భారీ నష్టాల దిశగా నడిపించాయి ఇవాళ. అయితే ఉద్రిక్తతలు చల్లారితే తప్ప పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి రావని మార్కెట్ నిపుణులు అంటున్నారు.