ఇరాన్ లో మరోసారి పెట్రేగిన ఆందోళనలు..ప్రభుత్వ మీడియా ఆఫీసుకు నిప్పు

ఇరాన్ లో మరోసారి పెట్రేగిన ఆందోళనలు..ప్రభుత్వ మీడియా ఆఫీసుకు నిప్పు

ఇరాన్ లో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. మొదట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగిన నిరసనలు ఇప్పుడు ఏకంగా  ప్రభుత్వాన్ని దించే నినాదంతో దేశవ్యాప్తంగా వ్యాపించాయి. దాదాపు 100 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్ఫాహాన్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (IRIB) భవనాన్ని నిరసనకారులు తగలబెట్టారు. దక్షిణ ఇరాన్‌లోని కీలకప్రాంతమైన ఓడరేవు నగరం బందర్ అబ్బాస్ వీధుల్లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ నిలిపివేశారు. భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. 

సరిగ్గా పన్నెండురోజుల క్రిత  డిసెంబర్ 28, 2025న ఇరాన్ లో అల్లర్లు చెలరేగాయి. కరెన్సీ పతనం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న క్రమంలో దేశరాజధానిలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ప్రారంభంలో ఆర్థిక సమస్యలతో మొదలైన నిరసనలు ..వేగంగా విస్తరించి రాజకీయ ఉద్యమంగా మారాయి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నిరసనకారులు బహిరంగంగా నినదిస్తున్నారు. 

ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 100 నగరాల్లో నిరసనలు ఉధృతం అయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై సాగిన నినాదాలు.. ఇప్పుడు ప్రభుత్వ చట్టబద్దతను సవాల్ చేస్తున్న నినాదాలుగా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. 

మరోవైపు ఆందోళనకారులను అదుపు చేసేందుకు భారీగా భద్రతాదళాలు మోహరించాయి. అనేక మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.కొన్ని చోట్ల కాల్పులు జరపడంతో ఇప్పటివరకు 30 మంది నిరసనకారులు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. పిల్లలతో సహా దాదాపు 2వేల మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

అణచివేత ఉన్నప్పటికీ ఆందోళనకారుల నిరసనలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది.