- కరీంనగర్ కోర్ సిటీలో 800 ఇండ్లు, రేకుర్తిలో 3,500కుపైగా ఆస్తులు
- అవన్నీ ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్ ల్యాండ్స్ అంటున్న ఆఫీసర్లు
- ఆందోళనలో ఇండ్లు, ప్లాట్ల యజమానులు
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 4,500లకు పైగా ఇండ్లు, ప్లాట్లను ఆఫీసర్లు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చారు. తాజాగా రూపొందించిన నిషేధిత ఆస్తుల జాబితాలో వీటిని చేర్చడంతో అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. అయితే.. ఈ ఇండ్లు, ప్లాట్లను తాము దశాబ్దాల క్రితమే కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్లు కూడా అయిన తర్వాత ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేరిస్తే ఎలా ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. అవన్నీ ల్యాండ్ సీలింగ్, అసైన్డ్, ప్రభుత్వ భూములని ఆఫీసర్లు చెబుతున్నారు. వందల కోట్ల విలువైన ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
నిషేధిత జాబితాలో 1,360 ఎకరాలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెయిన్ సిటీతో పాటు రేకుర్తి ఏరియాలో కలిపి సుమారు 1,360 ఎకరాలను రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు నిషేధిత జాబితాలో చేర్చారు.
కరీంనగర్ అర్బన్ మండల పరిధిలోని 79 సర్వే నంబర్లలో 830.34 ఎకరాల్లోని 957 ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇందులో కలెక్టరేట్, సీపీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీసు, అంబేద్కర్ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఆలయాలు, కుల సంఘాల భవనాలు, డెయిరీ భూములు పోను.. సుమారు 400 ఎకరాల్లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఇండ్లు, ప్లాట్లు ఉన్నాయి.
ఇండ్లు, ప్లాట్లకు సంబంధించిన సర్వే నంబర్, ఇంటి నంబర్, ఓనర్ పేరు, విస్తీర్ణం వంటి వివరాలతో లిస్ట్ రూపొందించారు. వీటిలో చాలా వరకు గతంలో వ్యవసాయం కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, పేదలకు అసైన్డ్ చేసిన భూములే ఉన్నాయి. ఆ తర్వాత ప్లాట్లుగా మారి, ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్లు అయ్యాయి.
రేకుర్తి పరిధిలో 536 ఎకరాలు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కొత్తపల్లి మండలం రేకుర్తి రెవెన్యూలో సుమారు 125 సర్వే నంబర్లలో 555 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ భూముల్లో సుమారు మూడు వేల ఇండ్లు, ఆరు వేల ప్లాట్లు ఉంటాయని అంచనా. ఈ భూములన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ల్యాండ్ రీఫార్మ్ యాక్ట్ 1973 అమల్లోకి వచ్చాక సీలింగ్ యాక్ట్ కింద షేక్ సాలేహ్ కుటుంబం నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాండ్స్ అని పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చారు.
అయితే ఈ సర్వే నంబర్లలో ప్లాట్లు, ఇండ్లు గతంలో గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అయ్యాయని, వాటిపై హోం లోన్లు, మార్టిగేజ్‌లు కూడా చేసుకున్నామని, తీరా ఇప్పుడు అమ్ముకోకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేరిస్తే తమ పరిస్థితి ఏమిటని రేకుర్తివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
