- తెలంగాణ, ఏపీని కలిపే యాక్సెస్ కంట్రోల్డ్ హైవే
- అన్ని చోట్లా లేటెస్ట్ టెక్నాలజీ వినియోగం
- ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీలు కవర్ చేసేలా కెమెరా
- సీసీ కెమెరాలు, స్ట్రీట్ లైట్లకు సోలార్ విద్యుత్ వినియోగం
- మేలో ప్రధాని మోదీతో ప్రారంభానికి ఏర్పాట్లు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్‌హెచ్ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్ 65, ఎన్‌హెచ్ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు. భారత్ మాల పరియోజన కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లో ఐదు ప్యాకేజీలుగా విభజించారు. తెలంగాణ పరిధిలో మూడు ప్యాకేజీలు (105.240 కిలోమీటర్లు), ఏపీలో రెండు ప్యాకేజీలు (56.890 కి.మీ.) ఉంది.
2022లో పనులు ప్రారంభం కాగా, వేర్వేరు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు మున్నేరు మీద బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకోగా, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి, మే మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైవే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తగ్గనున్న దూరం, ప్రయాణ సమయం!
ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు సూర్యాపేట, విజయవాడ మీదుగా 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త హైవే వల్ల హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మీదుగా వైజాగ్ వెళ్లేందుకు 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. మొత్తం స్లోప్ కలుపుకొని 30 మీటర్ల వెడల్పుతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. ఒక వైపు 9 మీటర్ల చొప్పున రోడ్లు, మధ్యలో నాలుగున్నర మీటర్ల మీడియన్ ఉంటాయి.
18 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో ప్రయాణించిన దూరాన్ని బట్టి ఎగ్జిట్ పాయింట్ దగ్గర టోల్ కట్ అవుతుంది. హైవేపైకి పశువులు రాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్బేలు సిద్ధం చేస్తున్నారు. డొంకదారులు, అంతర్గత రహదారుల దగ్గర అండర్ పాస్ లు, సాగునీటి కాల్వల దగ్గర 10 మేజర్ బ్రిడ్జిలు, 49 మైనర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒక వైపు రెండు లేన్లకు గాను 80, 100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ గా నిర్ణయించారు.
విల్లు ఆకారంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి!
ఖమ్మం నగరాన్ని ఆనుకొని వెళ్తున్న రైల్వే ట్రాక్ పై నుంచి ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని విల్లు ఆకారంలో నిర్మిస్తున్నారు. బౌ స్ట్రింగ్ గిర్డర్ బ్రిడ్జిగా దీన్ని వ్యవహరిస్తున్నారు. 52 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి 360 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో హైగ్రేడ్ స్టీల్ తో నాలుగు నెలల పాటు తయారుచేశారు. తర్వాత విడిభాగాలుగా తీసుకువచ్చి మళ్లీ ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు.
జాకీల సాయంతో క్రమంగా పైకి ఎత్తుతున్నారు. 11 మీటర్ల ఎత్తుండే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేందుకు ఇంకా రెండు నెలలు పడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకు ఒకవైపు నిర్మాణాన్ని కంప్లీట్ చేసి, రాకపోకలకు అనుమతి ఇస్తామంటున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిగా రైల్వే అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రతి దశలో రైల్వే సేఫ్టీ టీమ్ తనిఖీలు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పనులు ముందుకెళ్తున్నాయి.
రూల్స్ బ్రేక్ చేయకుండా సీసీ కెమెరాలతో చెక్!
162 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిపై ప్రతి రెండు కిలోమీటర్లకు 360 డిగ్రీలు కవర్ చేసే ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రతి కెమెరా ఒక కిలోమీటర్ దూరం వరకు వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్‌తో ఈ కెమెరాలు 24 గంటలు పని చేస్తాయి. వాహనాలు ఓవర్ స్పీడ్ వెళ్లినా, బాగా నెమ్మదిగా వెళ్లినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, సీటు బెల్ట్ పెట్టకపోయినా, హైవేపై వాహనం నిలిపి ఉంచినా ఆ వాహనాల ఫొటోలు తీస్తాయి.
జూమ్ చేసినా వీడియో క్లారిటీ దెబ్బతినకుండా, వాహనాలు స్పీడ్ గా వెళ్తున్నా నెంబర్ ప్లేట్ కూడా రికార్డ్ అయ్యేలా హై రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో పాటు హైవే మధ్యలో ఏర్పాటు చేస్తున్న లైట్లకు కూడా పూర్తిగా సోలార్ ప్యానల్స్ బిగించారు. బయటి నుంచి విద్యుత్ అవసరం లేకుండా, సోలార్తోనే నడిచేలా వాటికి రీచార్జబుల్ బ్యాటరీలను బిగించారు. వేరియేబుల్ మెసేజ్ సైన్(వీఎంఎస్) బోర్డులను అక్కడక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్, వెదర్, ట్రాఫిక్ డైవర్షన్ ఇన్ఫర్మేషన్, అలర్ట్ మెసేజ్‌లను ఈ సైన్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు.
అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్!
ఐదు ప్యాకేజీల్లోనూ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్) సెంటర్ ను ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో ఉండే సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి రియల్ టైమ్ ట్రాఫిక్ మూమెంట్ ను పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై మానిటర్ చేస్తారు. వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తే సీసీ కెమెరాలు ఆటోమెటిక్‌గా రికార్డు చేసి, ఫొటోల రూపంలో ఏటీఎంఎస్ సెంటర్ కు పంపిస్తాయి. ప్రమాదం జరిగినా, వాహనం అనుకోకుండా ఆగిపోయినా ఈ సెంటర్ లోని ఎల్ఈడీ స్క్రీన్లపై అలర్ట్ చేసేందుకు పాప్ అప్ మెసేజ్ వస్తుంది.
హైవే ప్రారంభం తర్వాత అన్ని కెమెరాలు అన్ని చోట్లా కనిపించేలా చూడడంతో పాటు రాష్ట్ర పోలీసులకు వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీంతో నేరుగా ట్రాఫిక్ చలానా జనరేట్ అయ్యేలా ఉపయోగించనున్నారు. ఇక యాక్సిడెంట్లు లేదా ట్రాఫిక్ మళ్లింపు సమయంలో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ను ఏర్పాటు చేశారు.
రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేస్తాం..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇదే. సంప్రదాయ హైవేల తరహాలో కాకుండా స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ హైవే నిర్మిస్తున్నాం. రోడ్ సేఫ్టీని క్లోజ్‌గా మానిటర్ చేసేలా చర్యలు తీసుకున్నాం. సీసీ కెమెరాలు, ఏటీఎంఎస్లు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ వాయిలేషన్స్ తగ్గుతాయి. రెండు నెలల్లో పనులన్నీ కంప్లీట్ చేసి, మే నెలలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం.
– పి.శివశంకర్, రీజనల్ ఆఫీసర్, ఎన్హెచ్ఏఐ
ప్యాకేజీ పొడవు (కి.మీ.) నిధులు (రూ.కోట్లలో)
తల్లంపాడు నుంచి సోమవరం 33.604 1063
సోమవరం నుంచి చింతగూడెం 29.513 761.73
చింతగూడెం నుంచి రేచర్ల 42.119 948.64
రేచర్ల నుంచి గురవాయిగూడెం 27.428 752.02
గురవాయిగూడెం నుంచి దేవరపల్లి 29.462 926.48
