కేటీఆర్, హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు: మంత్రి పొంగులేటి ఫైర్

కేటీఆర్, హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు: మంత్రి పొంగులేటి ఫైర్

హైదరాబాద్: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల ఇష్యూపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 26) ఆయన సెక్రటేరియట్‎లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ విజయం సాధిస్తోందని.. కాంగ్రెస్ విజయాన్ని జీర్ణించుకోలేకే ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్, హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని.. తమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారని గుర్తు చేశారు. రూ.5600 కోట్లు తుమ్మడి హట్టికి ఖర్చు  చేశామని తెలిపారు. కానీ బీఆర్ఎస్ స్వలాభం కోసం కాళేశ్వరం దగ్గర ప్రాజెక్ట్ కట్టిందని ఆరోపించారు.

 ఎనిమిదో వింత అంటూ బీఆర్ఎస్ గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లలోనే కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 4 ఏండ్లలో వాడింది కేవలం 112 టీఎంసీలు మాత్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో పెట్టామన్నారు. 

కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే పారిపోయారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామని.. కానీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదన్నారు. ఇక, సీతరామ ప్రాజెక్ట్ కింద బీఆర్ఎస్ ఒక్క కాల్వ కూడా తవ్వలేదని అన్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలో రాజీ పడే సమస్యే లేదని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖలో లక్ష కోట్లకు పైగా డబ్బులు కొల్లగొట్టారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావుకు అసెంబ్లీ బయట రంకెలేయడం తప్ప ఏమి తెలియదని విమర్శించారు. ఎన్నిసార్లు ఓడినా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.