- ఈ ధరల్లోనే 200 నుంచి 400 మందికి భోజనాలు
- హనుమకొండలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ట్రస్ట్ ప్యాకేజీలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
వరంగల్, వెలుగు: ‘ఎండా కాలంలో చల్లని ఏసీ హాల్‍లో పెండ్లి.. ఎంట్రన్స్ లో కపుల్స్ బ్యానర్, బెలూన్‍లు, రంగురంగుల పూలతో పెండ్లి మండపం డెకరేషన్, అమ్మాయి, అబ్బాయిని ఠీవిగా తీసుకురావడానికి మూవింగ్ సింహాసనం.. నీలిమేఘాల మాదిరి చుట్టూరా స్నో.. మాటలు, ఆటపాటలతో వేడుకను హుషారెత్తించే యాంకర్.. జిగేల్‍మనే లైటింగ్.. స్టెప్పులేయాలనిపించే మ్యూజిక్ సిస్టం.. పెండ్లితంతు జరిపించే అయ్యగారు.. వీటన్నింటిని లైఫ్‍లాంగ్ చూసుకునేలా ఫొటో, వీడియో షూట్.. చివర్లో 400 మంది గెస్ట్‌లకు 13 రకాల నోరూరించే విందు’ వామ్మో.. ఇవన్నీ కావాలంటే తక్కువ మాటాలా? ఖర్చు తడిసి మోపడవుతుందనుకుంటున్నారా? అవును నిజమే. కానీ, కేవలం రూ.2 లక్షలకే ఇవన్నీ అరెంజ్ చేసి ఘనంగా పెండ్లి తంతు నడిపించేందుకు గ్రేటర్ వరంగల్ సిటీలోని హనుమకొండలో ఓ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఈ విషయం బయటకొచ్చిందో లేదో దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే మొదలైంది.
తక్కువ ఖర్చులో ఫంక్షన్
ఈ రోజుల్లో ఏసీ ఫంక్షన్‍హాల్‍లో పెండ్లి జరపాలంటే ఖర్చు కనీసం రూ.10 లక్షలకు తగ్గడంలేదు. రూ.లక్ష ఫంక్షన్‍హాల్, మరో లక్ష డెకరేషన్, మ్యూజిక్, లైటింగ్, బెలూన్ డెకరేషన్‍కు మరో లక్ష.. అడిషనల్ స్నో సెట్టింగ్, యాంకర్ అంటే మరో లక్ష. చివరకు నోరూరించే భోజనాలకు జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే.
ఒకనొక సమయంలో చేతిలో డబ్బులున్నా..వీటిని మాట్లాడే సమయం, అనుభవం ఉండవు. అయితే, హనుమకొండ ములుగురోడ్‍లోని శ్రీ వాసవీమాత ఆలయ ప్రాంగణంలోని వాసవీ ఏసీ గార్డెన్‍లో కేవలం రూ.2 లక్షలకు 400 మందితో పెండ్లి తంతు.. లేదంటే రిసెప్షన్ జరిపిస్తున్నారు. రూ.75 వేలకే 150 మందితో బారసాల, శారీ ఫంక్షన్, ఎంగేజ్‍మెంట్, షష్ఠిపూర్తి ఫంక్షన్ చేసుకోడానికి అవకాశం కల్పించారు.
13 రకాల సేవలు.. 13 రకాల వంటలు
వాసవీ ఏసీ గార్డెన్ నిర్వాహకులు రూ.2 లక్షల ప్యాకేజీలో పెండ్లి లేదంటే రిసెప్షన్ చేసుకునే క్రమంలో 13 రకాల సేవలతో పాటు 13 రకాల శాఖహార భోజనం అందిస్తున్నారు. సేవల్లో ఏసీ హాల్, స్వాగత బ్యానర్, బెలూన్ స్వాగత డెకరేషన్, పెళ్లి మండపం అలంకరణ, మ్యూజిక్ సిస్టం, సింహాసనం, స్మోక్, పెళ్లితంతు నిర్వహించే అయ్యగారు, ఉదయం సమయాల్లో 200 మందికి 2 రకాల టిఫిన్ అండ్ చాయ్, సాయంత్రం రిసెప్షన్‍లో బాదం పాలు, వెజ్ మంచూరియా అందిస్తారు.
శాఖహార భోజనంలో చక్కెర పొంగలి లేదంటే రవ్వ కేసరి, అన్నం, ఆలూ బిర్యానీ, పూరి, పాలకూర పప్పు లేదంటే టమాటా, వంకాయ కూర్మ, దోసకాయ ఆవ పచ్చడి, మిర్చి బజ్జి, పాపడ్, సాంబార్, పెరుగు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. టిఫిన్‍లో రవ్వ పొంగలి, టామాటా బాత్, దోసకాయ ఆవ పచ్చడితో సేమియా ఉప్మాలో ఏవైనా రెండు సెలక్ట్ చేసుకునే అవకాశమిచ్చారు. ఆపై చాయ్ ఉంటుంది. రూ.75 వేల ప్యాకేజ్‌లో నిర్వహించుకునే చిన్న ఫంక్షన్లకు అయ్యగారు వంటివి అవసరం ఉండదు.
అమ్మవారి పేరిట సేవా దృక్పథంతో..
హనుమకొండలోని వాసవీ మాత ఆలయం ఆధ్వర్యంలో సేవా దృక్పథంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మా ఆలయ పరిధిలో పని చేసే ట్రస్ట్ సభ్యులు సైతం ఈ సేవా కార్యక్రమానికి ఒక్కతాటిపై ముందుకొచ్చారు. అందువల్లే వాసవీ మాత పేరుతో సమాజం మేలు కోరేలా ఏసీ గార్డెన్‍లో శుభకార్యాలకు అవకాశమిస్తున్నాం.-అంచూరి విజయలక్ష్మి శ్రీనివాస్ గుప్తా, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి
