స్వర్ణయుగంలో అమెరికా.. స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ లో ట్రంప్

స్వర్ణయుగంలో అమెరికా.. స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ లో ట్రంప్
  • ధరలు తగ్గి వేతనాలు పెరిగాయన్న అమెరికా అధ్యక్షుడు
  • చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడి
  • దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించిన ట్రంప్
  • 10 నెలల పాలనలో 8 యుద్ధాలు ఆపేశానన్న ప్రెసిడెంట్

వాషింగ్టన్: అమెరికా ప్రస్తుతం స్వర్ణయుగంలోకి అడుగుపెట్టిందని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన పది నెలల పాలనలో  ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. ఈమేరకు 2026 'స్టేట్ ఆఫ్  ది యూనియన్' ప్రసంగంలో అమెరికా భవిష్యత్తు, తమ హయాంలో ఇప్పటి వరకూ సాధించిన అద్భుతాలను వెల్లడించారు. దేశం ప్రస్తుతం "అఫర్డబిలిటీ ఎరా" (అందుబాటు ధరల యుగం) మరియు "గోల్డెన్ ఏజ్" (స్వర్ణయుగం) లో ఉందని ఆయన ప్రకటించారు.

 సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, మరియు ప్రపంచ శాంతిపై ట్రంప్  తనదైన శైలిలో మాట్లాడారు. ‘‘ధరలు తగ్గి వేతనాల పెరుగుదల’’ ట్రంప్ తన ప్రసంగంలో ఆర్థికాంశాలకు పెద్దపీట వేశారు. ‘‘గతంతో పోలిస్తే గుడ్ల ధర 60%, చికెన్, కార్లు మరియు అద్దెలు భారీగా తగ్గాయి’’ అని ఆయన గణాంకాలతో వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూనే, విదేశీ దిగుమతులపై 10శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల అమెరికా తయారీ రంగం బలోపేతమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

తొమ్మిది నెలలుగా చొరబాట్లే లేవు

సరిహద్దుల విషయంలో ట్రంప్ అత్యంత కఠినమైన గళాన్ని వినిపించారు. గత తొమ్మిది నెలల్లో ఒక్క అక్రమ వలసదారుడు కూడా దేశంలోకి ప్రవేశించలేదని ఆయన ప్రకటించారు. ‘మెరిట్’ ఆధారిత వలసలకే ప్రాధాన్యత ఇస్తామని, ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం తప్పనిసరి చేస్తామని తెలిపారు. దేశంలో ఉన్న క్రిమినల్ గ్యాంగ్‌‌‌‌లను మరియు అక్రమ వలసదారులను భారీ ఎత్తున వెనక్కి పంపుతున్నట్లు వెల్లడించారు. సుమారు 2,400 మంది భారతీయులను కూడా ఇప్పటికే వెనక్కి పంపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

విదేశీ విధానం, యుద్ధాలు

ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో తానే కీలక పాత్ర పోషించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. 2025 మేలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ఆపి, అణు యుద్ధాన్ని నివారించానని అన్నారు. సుమారు 3.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాలకు అడ్డంకిగా ఉన్న 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

భారతీయులపై ప్రభావం చూపే అంశాలు

భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగించేలా ‘హెచ్​‌‌‌‌‌‌‌‌–1బి వీసా’ నిబంధనలను కఠినతరం చేయడం మరియు కనీస వేతన పరిమితిని పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ‘‘మనం మన సరిహద్దులను మూసివేశాం, మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాం.. ఇక అమెరికాను ఎవరూ ఆపలేరు’’ అంటూ రిపబ్లికన్ల కేరింతల మధ్య ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు. డెమొక్రాట్లు మాత్రం ఈ ప్రసంగాన్ని ‘‘అబద్ధాల పుట్ట’’గా అభివర్ణించారు.