సెక్రటేరియట్ ఉద్యోగులకు కేటాయించిన స్థలం కబ్జా.. రూ.54 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

సెక్రటేరియట్ ఉద్యోగులకు కేటాయించిన స్థలం కబ్జా.. రూ.54 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్ లో హైడ్రా మరోసారి జేసీబీలకు పనిచెప్పింది. కబ్జాకు గురైన సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది. గురువారం (ఫిబ్రవరి 26) గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. నెక్నాంపూర్‌లో సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన 2700 గజాల ప్రభుత్వ భూమిని కాపాడారు హైడ్రా అధికారులు. 

సుమారు 54 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు అధికారులు. నెక్నాంపూర్ లో 59.14 ఎకరాల ప్రభుత్వ భూమిని 2002లో సచివాలయ ఉద్యోగులకు కేటాయించారు. 2007లో ప్రభుత్వ అనుమతితో హుడా లేఅవుట్ చేసింది. లేఅవుట్ ప్రకారం 2700 గజాలు పార్కు ప్రజావసరాల కోసం కేటాయించారు. 

కబ్జాదారులు పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలంలో పునాదులు, పిల్లర్లు వేసి స్లాబ్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. కాలనీ నివాసితుల ఫిర్యాదుతో మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. అక్రమ నిర్మాణాల తొలగించారు. అదనంగా అమ్మిన 5 ప్లాట్లలో తాత్కాలిక షెడ్ల తొలగించారు. మొత్తం 2700 గజాల భూమి చుట్టూ ఫెన్సింగ్,  పబ్లిక్ స్పేస్ గా బోర్డులు ఏర్పాటు చేశారు. కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.