Prabhas The Raja Saab: ఏపీలో 'రాజా సాబ్' ప్రీమియర్స్ మోత.. నైజాంలో కనిపించని ప్రభాస్ బొమ్మ.. కారణం ఇదే!

Prabhas The Raja Saab: ఏపీలో 'రాజా సాబ్' ప్రీమియర్స్ మోత.. నైజాంలో కనిపించని ప్రభాస్ బొమ్మ.. కారణం ఇదే!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ లెక్కలు మారిపోతాయి. డార్లింగ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా పూనకాలు వస్తాయి. రేపు (జనవరి 9న) ప్రపంచవ్యాప్తంగా 'ది రాజా సాబ్' గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే, థియేటర్లలో బొమ్మ పడటానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నా, తెలుగు సినీ పరిశ్రమకు గుండెకాయ లాంటి తెలంగాణ ఏరియాలో మాత్రం పరిస్థితి మారింది. బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రీమియర్ షోలు లేకపోవడంతో తీవ్ర నిరాశ నెలకొంది.

ఏపీలో జాతర.. నైజాంలో నిశ్శబ్దం!

ఆంధ్రప్రదేశ్,ఓవర్సీస్ మార్కెట్లలో ఇప్పటికే 'రాజా సాబ్' హవా మొదలైపోయింది. ఏపీలో ప్రభుత్వం అడిగిన వెంటనే టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. జనవరి 8న సాయంత్రం 6 గంటలకే పలు చోట్ల ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. కానీ, హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బుక్ మై షో, పేటీఎం వంటి యాప్స్‌లో 'కమింగ్ సూన్' అనే బోర్డులు కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ నీరుగారిపోతున్నారు.

అసలు చిక్కు ఎక్కడ వచ్చింది?

సాధారణంగా ప్రభాస్ సినిమాలకు వారం రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఈసారి టికెట్ రేట్ల పెంపు,ఎక్స్‌ట్రా షోల పర్మిషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక జీవో (GO) రాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణం.  నిన్ననే ( జనవరి 7, 2026 ) తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో నిర్మాతలకు ఊరటనిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్మాతల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది.  ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఎగ్జిబిటర్లు బుకింగ్స్ హోల్డ్ లో పెట్టారు. సంక్రాంతి వంటి పెద్ద సీజన్‌లో, అందులోనూ ప్రభాస్ వంటి స్టార్ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం గతంలో ఎన్నడూ జరగలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో రేట్ల మోత.. ఇక్కడ ఆశల వల!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం 'రాజా సాబ్' క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ వెసులుబాటు కల్పించింది. ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో రూ. 150, మల్టీప్లెక్సుల్లో రూ. 200 చొప్పున పది రోజుల పాటు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. దీంతో మల్టీప్లెక్స్ టికెట్ ధర ఏకంగా రూ. 377 కి చేరింది. అంతే కాకుండా జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి 12 వరకు రెండు ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. అయితే  హైదరాబాద్‌లో కూడా ఇలాంటి వెసులుబాటు దక్కుతుందని ఆశించిన అభిమానులకు జనవరి 8 సాయంత్రం 9 గంటల ప్రీమియర్ షోల విషయంలో స్పష్టత లేకపోవడం పెద్ద దెబ్బ అని చెప్పాలి.

ఫ్యాన్స్ ఆవేదన.. 

"ప్రపంచమంతా రాజా సాబ్ నామస్మరణ చేస్తుంటే, ప్రభాస్ అడ్డా అయిన హైదరాబాద్ లో మాత్రం టికెట్లు దొరకకపోవడం దారుణం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంక్రాంతికి అసలైన వినోదం పంచాల్సిన సమయంలో ఈ సందిగ్ధత సినిమా వసూళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం నుంచి తక్షణమే సానుకూల స్పందన వస్తుందని, అర్ధరాత్రి కల్లా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో 'రాజా సాబ్' హారర్-కామెడీ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి!