హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, టీచర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీపీటీఎఫ్ ఆరోపించింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టింది. ఈ నిరసనలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ జి. హరగోపాల్ పాల్గొని, మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన విద్యావ్యవస్థను బాగు చేయటంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చకినాల అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ.. విద్యాశాఖలో రెండేండ్ల క్రితమే భాషా పండితులు, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారని, కానీ గిరిజన సంక్షేమ శాఖలో మాత్రం ఆ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే 423 పండిట్, పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.గిరిజన విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక టీఆర్టీ నిర్వహించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. నిరసనలో టీపీటీఎఫ్ రాష్ట్ర నేతలు బి. రాజు, ఎం. లక్ష్మయ్య యాదవ్, ఎస్. విజయ్ పాల్గొన్నారు.
