అగ్రి ఎగ్జిబిషన్లలో "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్" మూవీ స్టాల్స్.. మెచ్చుకుంటున్న రైతన్నలు

అగ్రి ఎగ్జిబిషన్లలో "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్" మూవీ స్టాల్స్.. మెచ్చుకుంటున్న రైతన్నలు

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తీయడం ఎంత కష్టమో, దానిని జనాల్లోకి తీసుకెళ్లడం అంతకంటే పెద్ద సవాలు. భారీ బడ్జెట్ చిత్రాలు ప్రచారానికి కోట్లు కుమ్మరిస్తుంటే.. చిన్న చిత్రాలు మాత్రం కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే వినూత్నమైన ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” మూవీ టీం. కేవలం గ్లామర్, వినోదం మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇస్తూ.. ఈ చిత్రబృందం సాగిస్తున్న ప్రయాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా సినిమాల ప్రమోషన్లు మాల్స్‌లోనో, పబ్‌లలోనో జరుగుతుంటాయి. కానీ.. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” టీమ్ మాత్రం అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లను వేదికగా మూవీ ప్రమోషన్ చేపట్టింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ‘రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షో’లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు సినిమా కాన్సెప్ట్‌ను వివరించారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరైన మెగా రైతు మేళాలో కూడా ఈ మూవీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రులు, అధికారులు, మహిళా యాక్టివిస్టులు ఈ చిత్రబృందం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.

ఈ చిత్రంలో ఆధునిక సాంకేతికత ప్రాధాన్యతను అద్భుతంగా చూపించారు. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్ వంటి టెక్నాలజీలను సంప్రదాయ వ్యవసాయంతో ముడిపెట్టి భవిష్యత్తు సాగు ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్లు వివరించారు. వ్యవసాయం, టెక్నాలజీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యం అని దర్శకుడు మధుదీప్ చెలికాని పేర్కొన్నారు.

కేవలం వ్యవసాయమే కాకుండా.. నేటి సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను, కుటుంబ విలువల ప్రాముఖ్యతను కూడా ఈ మూవీ స్పృశిస్తుంది. త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సప్తగిరి, హర్ష చెముడు, వేణు యెల్దండి వంటి 10 మంది ప్రముఖ కమెడియన్లు నవ్వులు పూయించనున్నారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అరవింద్ మండ్యం నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, వేసవి సెలవుల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. వినూత్న ప్రచారంతో మొదలైన ఈ ప్రయాణం వెండితెరపై ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.