టీసీఎస్ టెక్కీలకు షాకింగ్ వార్త.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తే ప్రమోషన్స్, హైక్స్ ఉండవ్..

టీసీఎస్ టెక్కీలకు షాకింగ్ వార్త.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తే ప్రమోషన్స్, హైక్స్ ఉండవ్..

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులపై 'వర్క్ ఫ్రమ్ ఆఫీస్' రూల్స్ మరింత కఠినతరం చేస్తోంది. ఆఫీసుకు రావాలనే నిబంధనను పాటించని ఉద్యోగులకు ఈసారి  అప్రైజల్స్ నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ నుంచి వచ్చిన ఈ హెచ్చరిక ఇప్పుడు వేలాది మంది ఉద్యోగుల్లో కలవరం సృష్టిస్తోంది.

టీసీఎస్ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఇమెయిల్స్ ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్ 2025) వరకు ఆఫీస్ అటెండెన్స్ నిబంధనలు పాటించని వారి అప్రైజల్ ప్రక్రియను కార్పొరేట్ విభాగం నిలిపివేసింది. జనవరి 2025 నాటికి కూడా ఎవరైనా నాన్-కాంప్లయింట్‌గా ఉంటే.. వారికి ఏకంగా 'పర్ఫార్మెన్స్ బ్యాండ్' కూడా కేటాయించమని స్పష్టం చేసింది. దీనివల్ల ప్రమోషన్లు మాత్రమే కాదు, వార్షిక జీతాల పెంపు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు రోజుకు 9 గంటలు ఆఫీసులో గడపాలి. కనీసం 4 గంటలు ఆఫీసులో లేకపోతే ఆటోమేటిక్ అలర్ట్స్ వెళ్లేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Also Read : ట్రంప్ టారిఫ్ బాంబుతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్..

ఉద్యోగుల ఆవేదన: 
మరోవైపు, ఉద్యోగుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగే జీతం కంటే ఆఫీసుకు రావడానికి అయ్యే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లో పెరుగుతున్న అద్దెలు, ఇతర ఖర్చులు ఎక్కువ భాగం పోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా ఖర్చులు, భోజన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఏడాదికి 5-10 శాతం జీతం పెరిగితే.. దానికంటే ఆఫీసుకు వెళ్లడం వల్ల నెలకు అయ్యే అదనపు ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయని కొందరు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు.

టీసీఎస్ కేవలం అప్రైజల్స్ మాత్రమే కాదు.. మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది:
1. వేరియబుల్ పే:
ఆఫీసు అటెండెన్స్ 85% కంటే తక్కువ ఉంటే వేరియబుల్ పేలో కోత విధిస్తున్నారు.
2. బిల్లింగ్ డేస్: ఏడాదికి కనీసం 225 రోజుల బిల్లింగ్ (ప్రాజెక్ట్ పని) తప్పనిసరి.
3. బెంచ్ సమయం: గతంలో నెలల తరబడి బెంచ్‌పై ఉండే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు దానిని ఏడాదికి కేవలం 35 రోజులకు తగ్గించారు.
4. నైపుణ్యాభివృద్ధి: ఖాళీగా ఉన్న సమయంలో రోజుకు 4 నుండి 6 గంటలు స్కిల్ డెవలప్‌మెంట్‌కు కేటాయించాలి.