హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్న ప్రతి కుటుంబానికి అప్పుడప్పుడు ఒక భయం వెంటాడుతుంటుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏదో ఒక చిన్న కారణం చూపి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారేమో అని. వాళ్ల భయంలోనూ వాస్తవం ఉంది. ముఖ్యంగా పాత అనారోగ్య వివరాలు సరిగ్గా చెప్పలేదని క్లెయిమ్ రిజెక్ట్ చేయడం మనం తరచుగా వింటుంటాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ భారత బీమా నియంత్రణ సంస్థ (IRDAI) ఒక చారిత్రాత్మక సంస్కరణను తీసుకువచ్చింది. అదే మొరటోరియం పీరియడ్ తగ్గింపు. ఈ మార్పు పాలసీ హోల్డర్లకు ఎంత మేలు చేస్తుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఏమిటీ మొరటోరియం పీరియడ్..?
సింపుల్ గా చెప్పాలంటే.. మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీని నిరంతరంగా కొన్ని ఏళ్ల పాటు ప్రీమియం కట్టి కొనసాగిస్తే.. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్‌ను తిరస్కరించడానికి అస్సలు వీలుండదన్నమాట. గతంలో ఈ గడువు 8 ఏళ్లు అంటే 96 నెలలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఐఆర్‌డీఏఐ దీనిని 5 ఏళ్లకు అంటే 60 నెలలకు తగ్గించింది. అంటే దీని ప్రకారం మీరు ఒకే పాలసీని వరుసగా 5 ఏళ్ల పాటు ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రీమియం కడుతూ రెన్యూవల్ చేస్తే.. 61వ నెల నుంచి కంపెనీ మీ క్లెయిమ్‌ను పాత రోగాల సాకుతో రిజెక్ట్ చేయటం అస్సలు కుదరదు.
పాలసీ తీసుకునే సమయంలో కొన్నిసార్లు ఏజెంట్లు ఫారమ్ నింపేటప్పుడు చేసే పొరపాట్ల వల్ల లేదా పాలసీదారులు తమ పాత అనారోగ్యాల గురించి అనుకోకుండా చెప్పడం మర్చిపోయినప్పుడు క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. దీనివల్ల దేశంలో ఇన్సూరెన్స్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది. అందుకే బాధ్యతాయుతమైన పాత కస్టమర్లకు రక్షణ కల్పించాలని ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల నిరంతర కవరేజీ తర్వాత.. ఇన్సూరెన్స్ కంపెనీలు పాత రికార్డులను తవ్వి తీయడం కొత్త రూల్స్ ప్రకారం ఇకపై కుదరదు.
మొరటోరియం పీరియడ్ పూర్తయినంత మాత్రాన అన్ని క్లెయిమ్స్ వచ్చేస్తాయని అనుకోకూడదు. క్యాన్సర్, గుండెపోటు వంటి పెద్ద వ్యాధులను కావాలని దాచిపెట్టి పాలసీ తీసుకుంటే.. అది మోసం కిందకే వస్తుంది. ఇలాంటి కేసుల్లో కంపెనీలు క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఇప్పటికీ ఉంది. అలాగే తప్పుడు హాస్పిటల్ బిల్లులు లేదా అబద్ధపు రిపోర్టులు ఇస్తే ఈ రూల్ వర్తించదు. మధ్యలో పాలసీ ప్రీమియం కట్టడం ఆపేస్తే మొరటోరియం క్లాక్ మళ్లీ మొదటి నుంచి మొదలవుతుంది. అంటే అన్నాళ్లుగా ఉన్న ట్రాక్ రికార్డ్ మళ్లీ సున్నాకు వెళ్లిపోతుంది.
పాలసీదారులు ఏం చేయాలి..?
పాలసీ తీసుకునేప్పుడే హెల్త్ హిస్టరీని నిజాయితీగా చెప్పడం అన్నిటికంటే మంచిది. ఒకవేళ పొరపాటున ఏదైనా మర్చిపోతే, పాలసీ తీసుకున్న మొదటి 15 రోజుల 'ఫ్రీ-లుక్' పీరియడ్‌లో వాటిని సరిదిద్దుకోవచ్చు. 5 ఏళ్ల గడువు అనేది మీకు అదనపు భరోసా మాత్రమే.. కానీ నిజాయితీ అనేది ప్రాథమిక సూత్రం ఇన్సూరెన్స్‌లో. ఈ కొత్త రూల్ వల్ల ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, దీర్ఘకాలిక పాలసీదారులకు క్లెయిమ్స్ విషయంలో గొప్ప భద్రత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
