దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్: ట్రంప్ టారిఫ్ బాంబుతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్..

దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్: ట్రంప్ టారిఫ్ బాంబుతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్..

ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రయాణం ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఊహించని భారీ నష్టాలతో ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా సెన్సెక్స్ 780 పాయింట్ల నష్టంతో క్లోజ్ కాగా.. నిఫ్టీ 264 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 304, నిఫ్టీ మిడ్ క్యాప్ అత్యధికంగా 1200 పాయింట్లకు పైగా నష్టాన్ని చూశాయి. దీంతో నిఫ్టీ సూచీ 1శాతం నష్టంతో చివరికి స్థిరపడింది. ఈ భారీ నష్టాలతో పెట్టుబడిదారుల సంపద లక్షల కోట్లలో ఆవిరైంది కేవలం ఒక్క రోజులోనే. 

నేడు దేశీయ మార్కె్ట్లలో అన్ని రంగాల షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి చిత్తుకావటంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఆగస్టు 26, 2025 తర్వాత భారీ నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ట్రంప్ టారిఫ్స్ భయాలతో భారత మార్కెట్లలో గడచిన నాలుగు నెలల్లో ఎన్నడూ చూడని పతనాన్ని మూటగట్టుకున్నాయి. 

Also Read : ట్రంప్ నిర్ణయంతో కుప్పకూలిన టెక్స్‌టైల్, రొయ్యల స్టాక్స్

విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం పెట్టుబడులను అమ్మేస్తూ డబ్బు వెనక్కి తీసుకోవటం, వీక్లీ డిరివేటివ్ ఎక్స్ పెయిరీ కూడా ఇవాళ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దానికి తోడు ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, హాంకాంగ్ హ్యాంగ్ శాంగ్ పతనం కూడా మార్కెట్ల సెంటిమెంట్లను దెబ్బతీసింది. మరోపక్క ఆలస్యమౌతున్న యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ సమయంలో ట్రంప్ 500 శాతం వరకు సుంకాలను ప్రకటించేందుకు వీలుగా తీసుకొస్తున్న కొత్త రక్షణ చట్టం కూడా మార్కెట్లను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. అలాగే మెటల్ రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్టర్ల లాభాల బుక్కింగ్ కనిపించిందని నిపుణులు అంటున్నారు. 

నేటి మార్కెట్ పతనంలో గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, అవంతి ఫీడ్స్ వంటి ఎగుమతి కంపెనీల షేర్లు 7% నుంచి 13% వరకు నష్టపోయాయి. అలాగే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా అమ్మకాల ఒత్తిడిని చూశాయి.