ఏప్రిల్ నుంచి మారనున్న క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి..

ఏప్రిల్ నుంచి మారనున్న క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి..

ఏప్రిల్ 1, 2026 నుంచి క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించిన 'డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026' ప్రకారం 5 కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 1962 నాటి పాత నిబంధనల స్థానంలో రాబోతున్న ఈ కొత్త రూల్స్ మీ ఆర్థిక ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

1. భారీ బిల్లులపై ఐటీ నిఘా
ఏడాది పొడవునా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీల మొత్తం రూ.10 లక్షలు దాటితే ఆ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును లక్షకు మించి నగదు రూపంలో చెల్లిస్తే, అది కూడా ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసే వారిని పర్యవేక్షించడం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం.

2. పాన్ కార్డుకు అడ్రస్ ప్రూఫ్
కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై డాక్యుమెంటేషన్ సులభం కానుంది. మూడు నెలల లోపు ఉన్న క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా సమర్పించవచ్చు. ఇది డాక్యుమెంటేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తుంది.

3. క్రెడిట్ కార్డుతోనే పన్ను చెల్లింపులు
గతంలో ఆదాయపు పన్ను కట్టడానికి డెబిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లించవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పించినప్పటికీ, క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు అదనపు ఛార్జీలను గమనించుకోవాలి.

4. కంపెనీ క్రెడిట్ కార్డులపై టాక్స్ రూల్స్
కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే క్రెడిట్ కార్డులపై కూడా స్పష్టమైన నిబంధనలు వచ్చాయి. ఉద్యోగి వ్యక్తిగత అవసరాల కోసం కంపెనీ కార్డును వాడితే.. ఆ ఖర్చును పెర్క్విజిట్ గా పరిగణించి దానిపై పన్ను విధిస్తారు. అయితే కేవలం అధికారిక పనుల కోసమే కార్డును వాడి, కంపెనీ వద్ద పూర్తి రికార్డులు ఉంటే దానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

5. పాన్ నంబర్ తప్పనిసరి
ఇకపై ఏ బ్యాంకులోనైనా క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే పాన్ నంబర్ సమర్పించడం తప్పనిసరి. పాన్ లేకుండా ఇచ్చే దరఖాస్తులను బ్యాంకులు రిజెక్ట్ చేస్తాయి. భారీ లావాదేవీలను పన్ను వ్యవస్థతో అనుసంధానించడానికి.. నకిలీ ఖాతాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.