మనుషులు చనిపోయినా వారి సోషల్ మీడియా ఖాతాలు మాత్రం యాక్టివ్‌గానే ఉంటే ఎలా ఉంటుంది? మనం లేకపోయినా మన తరపున మన స్నేహితులకు మెసేజ్‌లు పంపడం, పోస్ట్‌లు పెట్టడం, ఆఖరికి వీడియో కాల్స్ కూడా మాట్లాడగలిగే సాంకేతికత అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలాగా ఉన్నా.. సోషల్ మీడియా దిగ్గజం మెటా దీనిని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. చనిపోయిన తర్వాత కూడా యూజర్ల అకౌంట్లను యాక్టివ్‌గా ఉంచేలా ఒక సరికొత్త AI సిస్టమ్ కోసం మెటా తాజాగా పేటెంట్ పొందింది.
ఈ సరికొత్త సాంకేతికత ప్రకారం.. ఒక వ్యక్తి బతికున్నప్పుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లు, వారి మాట్లాడే విధానం, ఇష్టాయిష్టాలను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషిస్తుంది. ఈ డేటా ఆధారంగా సదరు వ్యక్తికి సంబంధించిన ఒక డిజిటల్ రెప్లికా అదే వర్చువల్ రూపాన్ని ఏఐ సృష్టిస్తుంది. ఒకవేళ ఆ యూజర్ చనిపోయినా లేదా చాలా కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా.. వారి తరపున ఈ ఏఐ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇతరుల పోస్ట్‌లకు స్పందించడం, ప్రైవేట్ మెసేజ్‌లు పంపడం వంటివి చేస్తుంది. కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే కాకుండా సదరు వ్యక్తి గొంతుతో ఆడియో కాల్స్, వారి రూపంతో వీడియో కాల్స్ కూడా చేసేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.
ALSO READ : పని చేయకపోయినా క్రెడిట్ కొట్టేస్తున్న ప్రధాని మోడీ
ముఖ్యంగా క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సెలవుల్లో ఉన్నప్పుడు వారి ఫాలోయర్స్ తగ్గిపోకుండా ఉండేందుకు ఈ ఏఐ ఏజెంట్ నిరంతరం అకౌంట్‌ను రన్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి డిజిటల్ అస్తిత్వాన్ని ఇలా కొనసాగించడంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. చనిపోయిన వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడటం అనేది వారి కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తుందా లేకపోతే వారిని మానసిక వేదనను కలిగిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డేటా ప్రైవసీ, యూజర్ల సమ్మతి వంటి అంశాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి.
గతంలో మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి ఒక చాట్‌బాట్ కోసం పేటెంట్ తీసుకోగా.. మెటా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి పూర్తిస్థాయి డిజిటల్ లెగసీని సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మెటా ఈ సాంకేతికతను వెంటనే విడుదల చేసే ఉద్దేశం లేదని చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో మన డిజిటల్ జీవితం మనం చనిపోయిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని ఈ పేటెంట్ స్పష్టం చేస్తోంది. ఏఐ మరణాన్ని కూడా జయించి, మనల్ని డిజిటల్ రూపంలో కలకాలం జీవించి ఉంచే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే.
