కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చేసిన విమర్శలు కురిపించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన UPIని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా స్పందిస్తూ, ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు.
ఒక గ్రూప్ ప్రాజెక్ట్‌లో కొంతమంది విద్యార్థులు అసలు పని చేయకపోయినా, చివర్లో వచ్చి మార్కులు, పేరు మాత్రం కొట్టేయాలని చూస్తుంటారు. ప్రధాని మోడీ కూడా అలాగే చేస్తున్నారని పవన్ ఖేరా విమర్శించారు. UPI వెనుక ఉన్న అసలు ఆలోచన, పునాది 2012-2013లోనే పడిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి యూపీఏ (UPA) ప్రభుత్వ హయాంలో నందన్ నీలేకని నేతృత్వంలోని బృందం దీనికి రూపకల్పన చేసిందని వివరించారు.
ప్రధాని మోడీకి కొత్త ఆలోచనలు చేసే శక్తి లేదని, కేవలం రిబ్బన్లు కట్ చేయడం, కాంగ్రెస్‌ను తిట్టడం, ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ దొంగిలించడం మాత్రమే ఆయనకు తెలుసని పవన్ ఖేరా ఆరోపించారు. UPI అధికారికంగా 2016లో మోడీ ప్రభుత్వంలో ప్రారంభమైన మాట నిజమే అయినా, దానికి కావలసిన సాంకేతికత, కమిటీల పని మాత్రం అంతకు ముందే జరిగాయని కాంగ్రెస్ వాదిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న UPI విజయానికి అసలు కారణం ఎవరు అనే విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య గత కొంతకాలంగా ఈ క్రెడిట్ వార్ నడుస్తోంది. పవన్ ఖేరా చేసిన ఈ 'క్లాస్‌మేట్' వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రధాన మంత్రి కార్యాలయం లేదా బిజెపి నాయకులు స్పందించలేదు.
