- ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక స్కూల్ పెడ్తామన్న సర్కార్
- క్యూర్ బయట 94 బడుల నిర్మాణానికి నిర్ణయం
- వచ్చే ఏడాది ప్రారంభం కష్టమే అంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న సర్కారు టార్గెట్ ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ పనులు ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినా.. కొత్త స్కూళ్ల ఏర్పాటు ప్రక్రియలో ఆఫీసర్లు చొరవ చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కోర్ సిటీ మినహాయిస్తే మొత్తం 98 నియోజకవర్గాలున్నాయి. తొలుత ఒక్కో సెగ్మెంట్‌లో ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు స్కూళ్లకు అనుమతులు రాగా.. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వంగూరు, మంచాల, పోల్కంపల్లి టీపీఎస్‌ల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. మరో రెండు, మూడు నెలల్లో వీటిని అఫీషియల్‌గా ప్రారంభించేలా సర్కారు కసరత్తు చేస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. మిగిలిన 94 స్కూళ్లకు మాత్రం ఇంతవరకు పరిపాలనా అనుమతులు రాలేదు. కాగా, ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రూ. 500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు జిల్లాల్లో పర్యటించి, స్థలాలను డైరెక్ట్‌గా పరిశీలించి సర్కారుకు నివేదికలు పంపించినా ఆశించిన వేగం అందుకోలేదు.
వెనక్కి పంపడంతో ఆలస్యం
నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున కలెక్టర్ల నుంచి ప్రపోజల్స్ వచ్చినప్పటికీ, బడ్జెట్ అంచనాలు హెవీగా ఉండటంతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కొన్నింటిని వెనక్కి పంపారు. ఒక్కో స్కూల్‌ను రూ. 10 కోట్ల బడ్జెట్ లిమిట్‌లో నిర్మించాలని, దానికి అనుగుణంగా ప్రపోజల్స్ రెడీ చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. దీంతో పలు జిల్లాల్లో ప్రపోజల్స్ కూడా ఆలస్యమైంది. మరోవైపు స్థల సేకరణ అధికారులకు పెద్ద హెడ్‌ఏక్‌గా మారింది.
స్కూల్ నిర్మాణం చేపట్టాలంటే కనీసం 4 ఎకరాల ల్యాండ్ ఉండాలని సర్కారు కండిషన్ పెట్టింది. టౌన్ ఏరియాలు, నియోజకవర్గ కేంద్రాలకు సమీపంలో ఇంత పెద్ద మొత్తంలో గవర్నమెంట్ ల్యాండ్ దొరకడం కలెక్టర్లకు ఛాలెంజింగ్‌గా మారింది. దీంతో 17 నియోజకవర్గాల్లో ఇప్పటికీ ప్రాపర్ ల్యాండ్‌ను సెలెక్ట్ చేయడం ఆలస్యమైంది. ఆ తర్వాత స్థలంలో ఓ ఎకరం తక్కువగా ఉన్నా.. ఒకే చేశారు. ప్రస్తుతం మొత్తం క్యూర్ బయటున్న బడులకు అనుమతులకు అధికారికంగా ‘అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్’ రావాల్సి ఉంది. ఈ గ్రీన్ సిగ్నల్ వస్తేనే టెండర్ల ప్రక్రియ మొదలయ్యే చాన్స్ ఉంటుంది.
వచ్చే ఏడాది ప్రారంభం అనుమానమే..
ప్రస్తుతం ఆరుట్లలో ఒక స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇతర స్కూళ్ల ప్రారంభంపై అధికారులు ఫోకస్ పెంచాలని ఆదేశించారు. కానీ, గ్రౌండ్ లెవల్‌లో సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉంది. దశల వారీగా 94 స్కూళ్లకు ప్రపోజల్స్ పంపించినా అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్లు ఇవ్వలేదు. కనీసం తొలుత వచ్చిన వాటికి ముందుగా అనుమతులు ఇచ్చినా.. ఈ పాటికి పనులు మొదలయ్యేవని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అనుమతులు వచ్చాక టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను ఫైనల్ చేసి, నిర్మాణాలు పూర్తి చేయడానికి టైమ్ పడుతుంది. పనులు సాగుతున్న స్పీడ్ చూస్తుంటే వచ్చే అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి ఈ స్కూళ్లు అందుబాటులోకి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
