హోమ్ లోన్ ఈఎంఐ మిస్ అవ్వడం అనేది ఎవరూ కావాలని చేసే పని కాదు. జీతం ఆలస్యంగా పడటం, ఊహించని మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఆటో-డెబిట్ ఫెయిల్ అవ్వడం వంటి కారణాల వల్ల ఇది జరుగుతుంటుంది. ఇలా జరిగినప్పుడు చాలామందిలో ఒకటే ఆందోళన.. బ్యాంక్ తమను డిఫాల్టర్‌గా ముద్రిస్తుందా? క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? అన్నదే. అయితే వాస్తవం మీరు భయపడినంత భయంకరంగా ఉండదు కానీ కాస్త సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. అసలు ఈఎంఐ చెల్లింపు మిస్ అయినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి కొన్ని రోజుల్లో ఏం జరుగుతుంది?
ఈఎంఐ తేదీ దాటిన వెంటనే బ్యాంక్ సిస్టమ్‌లో మీ లోన్ అకౌంట్ 'ఓవర్‌డ్యూ'గా మారుతుంది. ఇది ప్రాథమికంగా బ్యాంక్ అంతర్గత హెచ్చరిక మాత్రమే. ఒకటి రెండు రోజుల్లో మీకు ఆటోమేటెడ్ మెసేజ్‌లు, ఆ తర్వాత కలెక్షన్ టీమ్ నుంచి కాల్స్ రావడం మొదలవుతుంది. ఈ దశలో బ్యాంక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడదు. కేవలం పొరపాటున జరిగిందా లేక ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఫోన్ ఎత్తి, ఫలానా తేదీన కడతానని స్పష్టంగా చెబితే పరిస్థితి ప్రశాంతంగానే ఉంటుంది. అయితే లేట్ పేమెంట్ ఛార్జీలు లేదా పెనాల్టీ మాత్రం కచ్చితంగా పడతాయి.
ALSO READ : మనిషి చనిపోయినా సోషల్ మీడియా అకౌంట్ బతికే ఉంటుంది
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం?
ఈఎంఐ కట్టని వెంటనే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని చాలామంది భయపడతారు. కానీ సాధారణంగా 30 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అయితేనే బ్యాంకులు క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేస్తాయి. ఆ లోపు మీరు లోన్ ఈఎంఐ చెల్లించేస్తే సిబిల్ స్కోర్‌కు పెద్దగా నష్టం ఉండదు. ఒకవేళ రిపోర్ట్ చేసినా.. మీ గత రికార్డు బాగుంటే ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు ఇలా జరిగితే మాత్రం అది మీకు అలవాటుగా మారిందని భావించి స్కోర్‌ను భారీగా తగ్గిస్తారు క్రెడిట్ బ్యూరో సంస్థలు.
బ్యాంకులు దేనిని గమనిస్తాయి?
బ్యాంకులకు ఒక ఈఎంఐ మిస్ అవ్వడం కంటే.. కస్టమర్ మౌనంగా ఉండటం అంటేనే ఎక్కువ భయం. మీరు వారి కాల్స్ ఆన్సర్ చేయకుండా ఉంటేనే మీ అకౌంట్‌ను 'స్ట్రెస్‌డ్' కేటగిరీలోకి మారుస్తారు. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం వరుసగా 90 రోజుల పాటు చెల్లింపులు జరగకపోతేనే లోన్ అకౌంట్‌ను ఎన్‌పీఏగా గుర్తిస్తారు. కాబట్టి ఒక్క ఈఎంఐ మిస్ అయినంత మాత్రాన లీగల్ నోటీసులు రావు లేదా ఇంటిని స్వాధీనం చేసుకోరు.
ఈఎంఐ మిస్ అయితే భయపడి దాక్కోవద్దు. వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి. బ్యాంకుకు ఫోన్ చేసి విషయం వివరించండి. భవిష్యత్తులో ఇలా జరగకుండా మీ ఆటో-డెబిట్ లిమిట్స్, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. హోమ్ లోన్ అనేది క్రమశిక్షణతో కూడిన ప్రయాణం. ఒక నెల పొరపాటు జరిగినా, మీరు స్పందించే తీరును బట్టే బ్యాంక్ మీపై నమ్మకాన్ని పెంచుకుంటుంది. ఆ ఒక్క నెల ఇబ్బందిని దాటితే మీ లోన్ ప్రయాణం మళ్లీ సాఫీగా సాగుతుంది.
