చదువుకోవాలని చెబితే చంపేస్తావా..! నీట్‎కు ప్రిపేర్ అవ్వమన్నందుకు తండ్రిని కాల్చి చంపిన కొడుకు

చదువుకోవాలని చెబితే చంపేస్తావా..! నీట్‎కు ప్రిపేర్ అవ్వమన్నందుకు తండ్రిని కాల్చి చంపిన కొడుకు

లక్నో: పిల్లలు ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు కలలు కంటారు. ఇందుకు కోసం వాళ్ల జీవితాన్ని ఫణంగా పెట్టి పిల్లల బాగు కోసమే నిరంతరం పరితపిస్తారు. ఒక పూట ఉపవాసం ఉండైనా సరే పిల్లలకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటారు. అంతేకాకుండా పిల్లలు పక్కదారి పట్టకుండా బుద్ధిగా చదువు కోవాలని చెబుతారు. ఇలా చదువుకోవాలని చెప్పడమే ఓ తండ్రి ప్రాణాలు తీసింది. నీట్ పరీక్షకు సిద్ధమవ్వమని ఒత్తిడి చేయడంతో తండ్రిని కాల్చి చంపాడు ఓ 19 ఏళ్ల యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్ 2026, ఫిబ్రవరి 20వ తేదీ నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రతాప్ సింగ్ కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ (19) ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు.

పోలీసుల విచారణలో సంచలన విషయం బయటకు వచ్చింది. తండ్రిని కొడుకు అక్షతే హత్య చేసినట్లుగా తేలింది.  నీట్ పరీక్షకు ప్రిపేర్ కావాలని పదే పదే తిట్టడం, ఒత్తిడి చేయడంతోనే తండ్రిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అక్షత్ అంగీకరించాడు. ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరిగేవని.. ఫిబ్రవరి 20వ తేదీన కూడా ఇదే విషయంలో మరోసారి గొడవ జరిగిందని.. దీంతో కోపంలో తండ్రిని కాల్చి చంపినట్లు అక్షత్ ఒప్పుకున్నాడు. 

తండ్రిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టినట్లు తెలిపాడు. కొన్ని శరీర భాగాలను ఊరి చివర కాలువలో పడేశానని చెప్పాడు. అక్షత్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ మేరకు అక్షత్‎పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‎గా మారగా.. చదువుకోవాలని చెప్పినందుకు కన్న తండ్రిని చంపేస్తావా అని అక్షత్‎పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.