టైటిల్ చూడంగనే చేపకు 29 కోట్ల రూపాయలేంట్రా అనుకున్నారు కదూ. అవును ఇది నిజం. ఆ చేప ఖరీదు అంతే. కేజీ మాంసంతో 5 బుల్లెట్ బండ్లు కొనొచ్చు. న్యూ ఇయర్ తర్వాత జపాన్ లో జరిగిన అతిపెద్ద వేలం ఇది. 243 కేజీలున్న బ్లూఫిన్ టూనా ఫిష్.. అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించింది. గతంలో ఇలాగే రికార్డు ధరలో చేపను కొన్న వ్యక్తే.. తన రికార్డును తను బ్రేక్ చేసుకున్నాడు. చేపకు ఇంత ధర వెనుక ఉన్న ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
అంతరేటు పెట్టి ఎవరు కొన్నారు..?
జపాన్ టోక్యోలో తొయొసు ఫిష్ మార్కెట్లో నిర్వహించిన ఆక్షన్ లో జపాన్ కరెన్సీ ప్రకారం 510 యెన్ లు పలికింది ఈ చేప. మన కరెన్సీలో 29 కోట్ల రూపాయలు. ఇంత ధర పలికిన చేపను కియోషి కిమురా అనే వ్యక్తి కొన్నారు. జపాన్ లో ఫేమస్ కంపెనీ అయిన కియోమురా కార్పోరేషన్ చైర్మన్ ఆయన. జపాన్ లో ఆయనను టూనా కింగ్ అంటుంటారు. జపాన్ లో ఫేమస్ అయిన సుషి జన్మయి రెస్టారెంట్స్ నడిపే ఆయన.. ప్రతి సంవత్సరం వేలంలో అత్యధిక ధర చెల్లించి ఇలాంటి చేపలను దక్కించుకుంటారు.
వేలం తర్వాత ఆయన చెప్పిన మాటలు ఇవి.. తక్కువ ధరకే కొనాలని అనుకున్నా. కానీ.. బిడ్డింగ్ పెరుగుతూనే ఉంది. చేప క్వాలిటీ చూసి నన్ను నేను ఆపుకోలేకపోయా.. అంటూ వేలంపాట గురించి చెప్పుకొచ్చారు.
బ్లూఫిన్ టూనాకు ఎందుకంత రేటు..?
ప్రపంచంలో ఉన్న టూనా ఫిష్ లలో బ్లూఫిన్ టూనా చాలా ప్రత్యేకం. సాఫ్ట్, జ్యూసీ, ఫ్యాటీగా ఉండే ఈ ఫిష్ కోసం చాలా మంది ఎగబడి కొంటుంటారు. కలర్, టేస్ట్, ఆకృతి ఇతర టూనా చేపాలకంటే చాలా అద్భుతంగా ఉంటుంది.
1. బ్లూఫిన్ టూనా కొరత:
టూనా ఫిష్ సముద్ర గర్భంలో, ఉపరితంలో వేల మైళ్ల దూరం ప్రయాణిస్తుంటుంది. అందుకే దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. దీనికి తోడు.. డిమాండ్ ఆధారంగా టూనా ఫిష్ వేట ఎక్కువైపోయింది. కొన్ని ప్రభుత్వాలు బ్యాన్ విధించాయి కూడా. దీంతో ఇది దొరకడం కష్టం.
2. బ్లూఫిన్ టూనా పరిమాణం:
బ్లూఫిన్ టూనాలు కొన్ని 450 కిలోల వరకు పెరుగుతాయి. ఎంత పెద్ద చేపకు అంత ధర ఉంటుంది. పెద్ద చేప మాంసం రుచిలో, ఆకృతిలో అద్భుతంగా ఉంటుందంటారు.
3. వేట, రవాణా కష్టం:
జపాన్ ఒమా తీరంలో పట్టుకున్న టూనాకు అత్యధిక ధర పలుకుతుంది. దీన్ని పట్టుకోవడానికి వలలు వినియోగించరు. దీనికోసం ప్రత్యేక టెక్నిక్ ద్వారా వేటాడుతుంటారు. దీని వలన చేపకు గాయం కాకుండా.. స్ట్రెస్ లేకుండా.. అత్యంత నాణ్యత ఉంటుంది. చేప క్వాలిటీ తగ్గకుండా ఉండేందుకు అత్యంత వేగంగా రవాణా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అత్యంత ఖరీదైనదని చెబుతున్నారు.
4 అత్యధిక డిమాండ్:
ప్రపంచ వ్యాప్తంగా సుషి డిష్ కు పాపులారిటీ పెరుగుతుండటంతో డిమాండు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా బ్లూఫిన్ టూనా కు డిమాండ్ పెరుగుతోంది. జపాన్ లో టూనా మొదటి వేలం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కువ బిడ్ వేసి కొంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుందని రెస్టారెంట్స్ ప్లాన్ చేస్తుంటాయి. అందుకే దీన్ని చాలా ప్రిస్టేజ్ గా తీసుకుంటాయి.
దీనికి ముందు ఏ చేప అత్యంత ఖరీదైనది?
2019లో కూడా ఇలాంటి షాకింగ్ వేలం జరిగింది. ఆ సమయంలో, 278 కిలోల ట్యూనా చేప 333.6 మిలియన్ యెన్‌లకు అమ్ముడైంది - అంటే దాదాపు ₹20 కోట్లు. ఈ రికార్డు కూడా ₹29 కోట్ల విలువైన చేపను దక్కించుకున్న కియోషి కిమురా పేరిటనే ఉంది. తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు
చేప కోసం ₹29 కోట్లు ఖర్చు చేయడం కరెక్టేనా?
దీని గురించి విన్నప్పుడు.. ఈ డీల్ పెద్ద లాస్ మేకింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే ఏ రెస్టారెంట్ కూడా సుషీని అమ్మడం ద్వారా ₹29 కోట్లను తిరిగి పొందలేదు. అయితే ఇది మార్కెటింగ్, బ్రాండింగ్ గేమ్ అంటున్నారు.
అదెలాగంటే ఒక వ్యాపారి అంత ఖరీదైన చేపను కొనుగోలు చేసినప్పుడు, వారి పేరు ప్రపంచ మీడియా, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇది ఒకరకమైన ఫ్రీ అడ్వర్టైజింగ్ అని చెప్పవచ్చు. ఈ ఉచిత ప్రచారం విలువ కోట్ల విలువైన ప్రకటనల కంటే చాలా ఎక్కువ.
ఒక రెస్టారెంట్ యజమాని ప్రపంచంలోనే అత్యుత్తమ చేపలను కొనుగోలు చేయగలిగితే, అక్కడ వడ్డించే ప్రతిదీ అత్యుత్తమ నాణ్యతతో ఉంటుందని కస్టమర్లలో ప్రచారం జరుగుతుంది. ఈ స్ట్రాటజీ ఆహారం కోసం మాత్రమే కాకుండా, రిచ్ కస్టమర్లను ఆకర్శించడం కోసం ఉపయోగపడుతుంది. అందుకే ఇంత మొత్తం ఖర్చుచేస్తుంటారు.
ఇండియాలో ఇలాంటి ఖరీదైన చేప వేలం జరిగిందా..?
ఇండియాలో కూడా ఇలాంటి వేలం జరిగినప్పటికీ.. అంత ఖరీదైనది మాత్రం కాదు. అత్యంత ఖరీదైన చేపల వేలం జాబితాలో ఘోల్ చేప అగ్రస్థానంలో ఉంది. సెప్టెంబర్ 1, 2021న, మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో 157 చేపలు ₹1.33 కోట్లకు అమ్ముడయ్యాయి. ఘోల్ చేప కడుపులో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని సౌందర్య సాధనాలు, ఔషధాలలో ఉపయోగిస్తారు. హాంకాంగ్, జపాన్ వంటి దేశాలలో దీనికి అధిక డిమాండ్ ఉండటంతో దీనిని 'సముద్ర బంగారం' అని పిలుస్తారు. ఇదే కాకుండా, అక్టోబర్ 2025లో, పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మెదినీపూర్‌లో 88 టెలియా భోలా చేపలు పట్టుబడ్డాయి. వేలంలో, వాటి ధర దాదాపు ₹60 లక్షలు పలికింది.
