Indian Team: టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టుకి ఘోర పరాజయం ఎదురైంది. సూపర్-8 కీలక మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. దీంతో భారత జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్ రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ని తుది జట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ కూడా రియాక్ట్ అయ్యాడు.
తన యూట్యూబ్ చానెల్ లో టీమిండియా మాజీ క్రికెటర్ బద్రీనాథ్ మాట్లాడుతూ.. "ఇది ఊహించని షాక్.. నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది.. ఇది చిన్న ఓటమి కాదు.. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు భారత్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ని ప్రోటీస్ బ్యాటర్లు అటాక్ చేసిన విధానం దారుణంగా ఉంది.. ఇందుకు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జవాబుదారిగా ఉండాలి.. యాజమాన్యంతో పాటు ప్లేయర్స్ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్ లోకి అడుగు పెట్టారని బద్రీనాథ్ విమర్శించాడు.
భారత నెట్ రన్ రేటు గురించి ఆలోచనే లేదు.. సెలక్షన్ విషయంలోనే తప్పులు జరిగాయని భారత మాజీ క్రికెటర్ బద్రీనాథ్ మండిపడ్డాడు. మనవాళ్ల బ్యాటింగ్ శైలి ఏమాత్రం మంచిగా లేదు.. వీటన్నిటికీ జట్టు మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.. అయితే ఆత్మ విశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని గీత మాత్రమే ఉంటుంది.. భారత్ దానిని తుడిచి వేసేలా కనిపిస్తోందని తీవ్ర స్థాయిలో బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
