BAFTA 2026: 'బాఫ్టా' అవార్డును ముద్దాడిన 'బూంగ్'.. చిత్ర యూనిట్‌కు ప్రధాని మోదీ అభినందనలు!

BAFTA 2026: 'బాఫ్టా' అవార్డును ముద్దాడిన 'బూంగ్'.. చిత్ర యూనిట్‌కు ప్రధాని మోదీ అభినందనలు!

మణిపూర్ చిత్రసీమ సరికొత్త చరిత్ర సృష్టించింది. మణిపురి భాషా చిత్రం 'బూంగ్' (Boong) ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA - 2026) అవార్డుల్లో సత్తా చాటింది. లండన్‌లో జరిగిన 79వ బాఫ్టా వేడుకల్లో 'బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్' కేటగిరీలో ఈ సినిమా అవార్డును గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్రాంతీయ చిత్రంగా 'బూంగ్' రికార్డు నెలకొల్పింది.

ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

ఈ చారిత్రాత్మక విజయంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా 'బూంగ్' చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం, ముఖ్యంగా మణిపూర్ ప్రజలకు ఇది గొప్ప పండుగ. మన దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనం అని కొనియాడారు. ప్రధాని పోస్ట్‌కు చిత్ర నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సినిమాకు ప్రధాని అందిస్తున్న ప్రోత్సాహం తమకు మరింత ఉత్సాహాన్నిస్తుందని వారు పేర్కొన్నారు.

 

'బూంగ్' కథా నేపథ్యం ఏమిటి?

మణిపూర్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన బూంగ్ అనే బాలుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన తండ్రిని వెతుక్కుంటూ అతను చేసే ప్రయాణం, ఆ క్రమంలో ఎదురయ్యే అనుభవాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మణిపూర్ సాంస్కృతిక మూలాలను, అక్కడి ప్రజల జీవనశైలిని దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి అత్యంత సహజంగా తెరకెక్కించారు. ఈ మూవీకి లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించగా.. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ), చాక్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. 

వేదికపై శాంతి పిలుపు

మణిపూర్‌లో నెలకొన్న సామాజిక పరిస్థితులు, మానవీయ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ అవార్డు ప్రదానోత్సవంలో దర్శకురాలు లక్ష్మీప్రియా దేవి చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. అవార్డు అందుకున్న ఆనందంలోనూ ఆమె తన మాతృభూమి మణిపూర్‌లో జరుగుతున్న అశాంతిని గుర్తు చేసుకున్నారు. మణిపూర్‌లో శాంతి నెలకొనాలని, అక్కడ పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంతర్జాతీయ వేదికపై ఆమె విజ్ఞప్తి చేశారు. కళ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, మార్పుకు ఒక సాధనం అని ఆమె నిరూపించారు.