న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా బలగాలు ఏ క్షణమైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇండియా అప్రమత్తమైంది. ఇరాన్‌లోని భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.
ఈ మేరకు ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ‘‘2026, జనవరి 5న భారత ప్రభుత్వం జారీ చేసిన సలహాకు కొనసాగింపుగా ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు - విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు -వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లండి’’ అని ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది.
ఇరాన్‌పై అమెరికా వైమానికి దాడి చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇండియా తమ దేశ పౌరులను ఈ మేరకు అలర్ట్ చేసింది. మరోవైపు.. ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు పూర్తి అయ్యాయి. తదుపరి రౌండ్ చర్చలు గురువారం (ఫిబ్రవరి 26) జెనీవాలో జరగనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇరాన్ తమతో ఇప్పుడే డీల్ కుదుర్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఇరాన్ తప్పనిసరిగా ఒక ‘అర్థవంతమైన’ ఒప్పందం చేసుకోవాలి. ఒకవేళ ఇరాన్ అంగీకరించకపోతే, అమెరికా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అంటూ ఆయన పరోక్షంగా సైనిక చర్యపై సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
