తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో సాయి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సాయి తన పైన చేతబడి చేశాడని నిందితుడు బాలు హత్య చేసినట్లు సమాచారం. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ గ్రామాలు, పట్టణాల్లో కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. తమకు కావాల్సిన వారికి చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఎవరో మంత్రాలు, చేతబడి వంటివి చేశారని అనుమానం పెంచుకుంటున్నారు.
ఈ అనుమానం రోజురోజుకు బలపడి చివరకు దాడులు చేసే వరకు వెళ్తోంది. ఈ దాడుల్లో కొందరు గాయాలతో బయటపడుతుండగా, మరికొందరు తాము చేయని తప్పుకు బలైపోతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేటికీ కొందరు మూఢనమ్మకాలను నమ్ముతూ.. మంత్రాలు, చేతబడుల పేరుతో తోటి వారిని అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. కరణ్ కోట్ గ్రామంలో గ్రామంలో జరిగిన సాయి హత్య కూడా ఈ కోవలోకే వస్తుంది.
గ్రామాలు, తండాల్లో ఉంటున్న వారికి అక్షరాస్యత లేకపోవడంతో మూఢనమ్మకాలను ఈజీగా నమ్మేస్తున్నారు. తమ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకున్నా, ఇతర ఇబ్బందులు ఏమైనా ఎదురైనా వెంటనే ఎవరో మంత్రాలు చేయడం వల్లే సమస్యలు వస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో తమకు తెలిసిన బాబాలు, భూతవైద్యులను ఆశ్రయించడంతో వీళ్ల భయాన్ని ఆసరాగా చేసుకుంటున్న బాబాలు, భూతవైద్యులు అందినకాడికి దోచుకుంటున్నారు. తర్వాత ‘మీకు తెలిసిన వారే ఇదంతా చేస్తున్నారు’ అని చెబుతుండడంతో అనుమానం మరింత బలపడుతోంది.
ఈ క్రమంలో వారిని హతమారిస్తేనే తమ కుటుంబ కష్టాలు తీరుతాయన్న ఆలోచనతో దాడులకు తెగబడుతున్నారు. అనుమానంతో ఉన్మాదులుగా మారుతూ తమకు దగ్గరి వారినే హతమారుస్తూ జైలు పాలవుతున్నారు. దీంతో హత్యకు గురైన వారి ఫ్యామిలీతో పాటు, హత్య చేసిన వారి ఫ్యామిలీ సైతం రోడ్డు మీద పడుతున్నాయి.
