బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్, తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌పై చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి, అధ్యక్షుడి అధికారాన్ని ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని షహాబుద్దీన్ ఆరోపించారు. బెంగాలీ దినపత్రిక 'కలేర్ కాంతో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యూనస్ వ్యవహారశైలిని ఎండగట్టారు.
యూనస్ విదేశీ పర్యటనలు, కీలక ఒప్పందాలు.. ప్రభుత్వ విధానాల గురించి అధ్యక్షుడికి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదట. రాజ్యాంగం ప్రకారం విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చిన తర్వాత అధ్యక్షుడిని కలిసి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలి. యూనస్ 14 నుంచి 15 సార్లు విదేశాలకు వెళ్లినా ఒక్కసారి కూడా సమాచారం ఇవ్వలేదని షహాబుద్దీన్ బయటపెట్టారు. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో కూడా తనను పూర్తిగా చీకట్లో ఉంచారని, కనీసం మాట మాత్రంగానైనా చెప్పలేదని యూనస్ ఒంటెద్దు పాలన గురించి వాస్తవాలు బయటపెట్టారు.
కేవలం సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా.. తనను పరిపాలన పరంగా ఏకాకిని చేయడానికి యూనస్ ప్రభుత్వం ప్రయత్నించిందని షహాబుద్దీన్ ఆరోపించారు. అధ్యక్షుడి విదేశీ పర్యటనలకు వచ్చిన ఆహ్వానాలను తన ప్రమేయం లేకుండానే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఖతార్, కొసావో వంటి దేశాల ఆహ్వానాలను అధ్యక్షుడు బిజీగా ఉన్నారని చెబుతూ అధికారులు లేఖలు సిద్ధం చేశారని, ఆ బిజీ ఏమిటో తనకు కూడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా విదేశాల్లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయాల నుంచి అధ్యక్షుడి అధికారిక ఫోటోలను రాత్రికి రాత్రే తొలగించారని, ఇది తనను పదవి నుంచి తొలగించడానికి వేసిన మొదటి అడుగుగా ఆయన అభివర్ణించారు.
అధ్యక్ష భవనం ప్రెస్ విభాగాన్ని కూడా యూనస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, తన వద్ద పనిచేసే అధికారులను, ఫోటోగ్రాఫర్లను బలవంతంగా తొలగించారని షహాబుద్దీన్ వెల్లడించారు. ఒక దశలో రాజ్యాంగ విరుద్ధంగా తనను పదవి నుంచి తొలగించి.. ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలని ప్లాన్ చేశారని కూడా సంచలన ఆరోపణ చేశారు. అక్టోబర్ 2024లో తన కార్యాలయం ముట్టడికి గురైనప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని.. అయితే సైన్యం, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాజ్యాంగ కొనసాగింపును కాపాడగలిగానని స్పష్టం చేశారు. యూనస్ ప్రభుత్వం తన ఉనికిని తుడిచిపెట్టేయాలని చూసినా, తాను పట్టుదలతో పదవిలో కొనసాగుతున్నానని షహాబుద్దీన్ ప్రకటించటం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.
