T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ ఘోరంగా విఫలమవుతోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ వరుసగా మూడుసార్లు డకౌట్లు కావడం జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. గ్రూప్ దశలోనే టీమిండియా గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈసారి ఇషాన్ కిషన్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో జట్టు తొలి ఓవర్‌ల్లోనే ఒత్తిడిలో పడింది. ఈ వరుస వైఫల్యాల కారణంగా భారత్ ఈ టోర్నీలో అత్యంత చెత్త ఓపెనింగ్ భాగస్వామ్య సగటు కలిగిన జట్టుగా నిలిచింది.
భారత్ ఖాతాలో చెత్త రికార్డు:
టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ఓపెనింగ్ సగటు కేవలం 6.80 పరుగులే సాధించింది. ఈ జాబితాలో భారత్ 20వ స్థానంలో నిలిచింది. యూఏఈ, ఒమాన్, ఇటలీ లాంటి దేశాల కంటే కూడా భారత్ దిగువన ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
టాప్‌లో న్యూజిలాండ్:
ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ టీం ఓపెనింగ్ సగటు 84 పరుగులు, ఇది టోర్నీలోనే అత్యుత్తమంగా నిలిచింది. స్కాట్లాండ్, ఆస్ట్రేలియా కూడా మంచి ఆరంభాలతో ముందు వరుసలో ఉన్నాయి. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్‌ను జట్టులోకి తీసుకున్న తర్వాత ఓపెనింగ్ బాగా మెరుగుపడింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వారు సూపర్-8కు అర్హత సాధించలేకపోయారు.
సెమీఫైనల్ రేసు మరింత ఉత్కంఠ:
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సెమీఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడితే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. అంతేకాదు, సౌతాఫ్రికా తమ మిగిలిన మ్యాచ్‌ల్లో గెలవాలని కూడా భారత్ కోరుకుంటుంది. మరో గ్రూప్‌లో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. అక్కడ కూడా పోటీ మరింత ఉత్కంఠగా మారింది. ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచినా, ఓడినా సమీకరణాలు మారే అవకాశం ఉంది. సూపర్-8లో ఇకపై ప్రతి మ్యాచ్ కీలకం. ఎవరూ ఫేవరెట్ కాదు.. భారత్ ముందుకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఓపెనింగ్ సమస్యకు పరిష్కారం కనిపెట్టాల్సిందే. లేకపోతే వరల్డ్ కప్ ప్రయాణం ఇక్కడితో ముగిసే అవకాశం ఉంది.
టీమ్స్ ఓపెనింగ్ సగటు:
* న్యూజిలాండ్ – 84
* స్కాట్లాండ్ – 57.75
* ఆస్ట్రేలియా – 54.25
* దక్షిణాఫ్రికా – 37.20
* పాకిస్థాన్ – 30.25
* వెస్టిండీస్ – 27.50
* శ్రీలంక – 24
* ఇంగ్లాండ్ – 16.40
* ఒమాన్ – 10
* భారత్ – 6.80
