మెక్సికోలో డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మరణం తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. దింతో మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం (Embassy) అక్కడున్న భారతీయుల కోసం హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికోలో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అనే ప్రమాదకరమైన ముఠా నాయకుడు నెమెసియో ఒసేగురా సెర్వంటెస్ (ఎల్ మెంచో) హత్యకు గురయ్యాడు. దీనివల్ల అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు, హింసలు చెలరేగుతున్నాయి. దింతో అక్కడ ఉంటున్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని, బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ప్రభావిత ప్రాంతాలు:
జాలిస్కోలోని ప్యూర్టో వల్లర్టా, చాపాలా, గ్వాడలజారా, తమౌలిపాస్ లోని రేనోసా, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, మిచోకాన్, గెరెరో సహా న్యూవో లియోన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోని భారతీయులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇళ్లలోనే ఉండాలని కోరింది.
అసలేం జరిగిందంటే:
ఎల్ మెంచో మెక్సికోలో అత్యంత శక్తివంతమైన, పెద్ద డ్రగ్ ముఠాకు నాయకుడు. ఆదివారం మెక్సికో సైన్యం జరిపిన మెరుపు దాడిలో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం విమానంలో తరలిస్తుండగా మరణించాడు. ఈ కాల్పుల్లో ముఠాలోని మరో నలుగురు కూడా చనిపోయారు.
►ALSO READ | 'ఎల్ మెన్చో' ఎవరు ? ఒక మాజీ పోలీసు ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఎలా మారాడు?
ఎల్ మెంచో మరణంతో ఆగ్రహించిన ముఠా రోడ్లపైకి వచ్చి వాహనాలకు, పెట్రోల్ బంకులకు నిప్పంటించారు. విమానాశ్రయాలు, సూపర్ మార్కెట్లపై దాడులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, శాంతిగా ఉండాలని కోరారు. సైన్యం, భద్రతా దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె తెలిపారు.
