మెక్సికోలో అత్యంత భయంకరమైన డ్రగ్స్ మాఫియా డాన్ నెమెసియో ఒసేగురా సెర్వాంటెస్ ని అందరూ 'ఎల్ మెన్చో' అని పిలుస్తుంటారు. అయితే జాలిస్కో అనే రాష్ట్రంలో పోలీసులు చేసిన ఒక ఆపరేషన్‌లో ఇతను చనిపోయాడు. ఇతను 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG)' అనే ఒక పెద్ద మాఫియా ముఠాకు లీడర్.
ఎలా చనిపోయాడంటే:
టపాల్పా అనే ఊరిలో పోలీసులకు ఎల్ మెన్చో ముఠాకు మధ్య పెద్ద కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో 59 ఏళ్ల ఎల్ మెన్చోకు తీవ్ర గాయాలయ్యాయి. దింతో వైద్యం కోసం అతన్ని హెలికాప్టర్‌లో మెక్సికో సిటీకి తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు విడిచాడు.
ఎల్ మెన్చో మృతితో అల్లర్లు:
ఎల్ మెన్చో మరణంతో మెక్సికోలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. ఈ ముఠా అనుచరులు ప్రతీకారంతో రగిలిపోతూ దాడులకు దిగుతున్నారు. జాలిస్కో ప్రాంతంలో చాలా వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితులు దారుణంగా మారడంతో అక్కడ ఉన్న అమెరికా, కెనడా లాంటి దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరించాయి.
ఎల్ మెన్చో ఎవరు:
ఎల్ మెన్చో అసలు పేరు నెమెసియో రూబెన్ ఒసేగురా సెర్వంటెస్. మెక్సికోలో అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్. అత్యంత పేరుమోసిన నేరస్థుల్లో ఎల్ మెన్చో ఒకడు. పశ్చిమ మెక్సికోలో డ్రగ్స్ దందా చేసే 'CJNG' అనే ముఠాను ఇతనే స్థాపించాడు. 1966లో మెక్సికోలోని ఓ పేద గ్రామంలో పుట్టిన ఎల్ మెన్చో, 1980లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి అమెరికా జైలులో శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అమెరికా అతన్ని తిరిగి మెక్సికోకు పంపించేసింది.
సొంత దేశానికి వచ్చాక కొన్నాళ్లు స్థానికంగా పోలీస్‌గా పనిచేశాడు. కానీ డబ్బు ఆశతో మళ్ళీ డ్రగ్స్ దందాలోకి దిగాడు. చిన్నచిన్నగా ఎదుగుతూ చివరికి తానే సొంతంగా 'CJNG' అనే ముఠాను పెట్టుకున్నాడు. ఈ ముఠా అమెరికాకు భారీగా కొకైన్, హెరాయిన్, ఫెంటానిల్, మెథాంఫేటమిన్ లాంటి డ్రగ్స్ సప్లయ్ చేసేది. ఎదురు తిరిగిన వాళ్ళను, పోలీసులను అత్యంత దారుణంగా చంపడంలో ఇతని ముఠాకు పేరుంది.
కోటిన్నర రివార్డ్:
డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ ఆయుధాలు లాంటి ఎన్నో కేసుల్లో అమెరికా పోలీసులకు ఎల్ మెన్చో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతన్ని పట్టుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఏకంగా సుమారు కోటిన్నర రివార్డును కూడా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో ఒకడిగా మారిపోయాడు. ఎల్ మెంచో మరణంతో మెక్సికోలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టీ ఆ ముఠాలోని గ్రూపో డెల్టా అనే ఒక ఎలైట్ కమాండో దళంపై పడింది.
గ్రూపో డెల్టా అంటే ఏమిటి:
గ్రూపో డెల్టా ఆ మాఫియాలో ఒక ప్రత్యేకమైన వర్గం. మామూలుగా డ్రగ్స్ దందా చేసే వాళ్లలా కాకుండా, వీళ్లు పక్కా మిలిటరీ తరహాలో పనిచేస్తుంటారు. అమెరికా సైన్యంలోని ప్రత్యేక విభాగమైన 'డెల్టా ఫోర్స్' పేరును స్ఫూర్తిగా తీసుకుని వీళ్లు ఈ పేరు పెట్టుకున్నారని అధికారులు చెబుతున్నారు. పెద్ద పెద్ద నాయకులను హత్య చేయడం, టార్గెట్ చేసి దాడులు చేయడం, ఎదురు తిరిగిన వాళ్లపై లేదా పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడం లాంటి క్రూరమైన పనులకు ఈ టీమ్‌ను వాడుకుంటారు.
►ALSO READ | డ్రగ్స్ డాన్ మెన్ చో హత్య.. క్రిమినల్ సామ్రాజ్యాన్నే స్థాపించాడు.. మెక్సికో దేశంలో అల్లర్లు
2018లో జాలిస్కో పోలీసులు ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసినప్పుడు, తొలిసారిగా లాస్ డెల్టాస్ పేరు బయటకు వచ్చింది. జాలిస్కో మాజీ గవర్నర్ ను వీళ్లే హత్య చేశారు. పక్కా ట్రైనింగ్ తీసుకున్న షూటర్లు ఈ హత్య చేసి తప్పించుకున్నారు. 2020లో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు.. అతని దగ్గర భారీగా ఆయుధాలు, వాహనాలు, వాకీటాకీలు, డబ్బు దొరికాయి. దీన్ని బట్టి వాళ్లకు ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఈ ముఠా భారీ దాడులు చేసింది.
ఎల్ మెంచో చనిపోయాక, జాలిస్కోతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా ఈ అల్లర్లు వేగంగా పాకాయి. ఈ ముఠా రోడ్లను బ్లాక్ చేశారు, వాహనాలకు నిప్పు పెట్టారు, పోలీసులతో ఘర్షణకు దిగారు. పరిస్థితులు చేయి దాటుతుండటంతో ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
