సీఎం రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ క్యాంపస్‌లోనే ఈ కార్యక్రమం జరుగనుంది. భారత్ నుంచి తెలంగాణ సీఎం ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం.
ఈ సింపోజియంలో “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్‌లో ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
