ఇందిరమ్మ ఇండ్లలో అనర్హుల గుర్తింపు

ఇందిరమ్మ ఇండ్లలో అనర్హుల గుర్తింపు
  • కారు ఉన్న లబ్ధిదారుల 
  • ఇండ్లకు.. బిల్లులు స్టాప్
  • ఔట్ సోర్సింగ్​ ఎంప్లాయిస్​కు నిలిపివేత
  • ప్రజాపాలన అప్లికేషన్ల వడపోత
  • జాయింట్ ఫ్యామిలీకి స్లాబ్​ ఉన్నా.. నో

యాదాద్రి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం ప్రజాపాలన అప్లికేషన్లను వడపోస్తున్నారు. ఫీల్డ్​కు వెళ్లి మళ్లీ చెక్​ చేస్తూ అర్హులా కాదా అని చూస్తున్నారు. అనర్హులుగా తేలితే వారికి బిల్లులు నిలిచిపోనున్నాయి.

10,028 ఇందిరమ్మ ఇండ్లు

అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ స్కీమ్​అమలు చేస్తోంది. దీంతో యాదాద్రి జిల్లాలో ప్రజాపాలన అప్లికేషన్లలో ఇండ్ల కోసం వచ్చిన 2,01,977 అప్లికేషన్లను హౌసింగ్​డిపార్ట్​మెంట్​ పరిశీలించింది. వీరిలో ఎల్​-1, ఎల్​-2, ఎల్​-3గా విభజించి, విడతల వారీగా ఇండ్లను మంజూరు చేస్తోంది. మొదటి విడతలో 9175 ఇండ్లను మంజూరయ్యాయి. వీటిలో కొందరు తాము మొదటి విడతలో కట్టుకోలేమని, రెండో విడతలో కట్టుకుంటామని చెప్పడంతో 156 మంది పేర్లను తొలగించి వారి స్థానంలో ఇతరులకు మంజూరు చేసింది.

అనంతరం మంజూరైన వాటిని కలిపితే జిల్లాలో మొత్తంగా 10,028 మంది లబ్దిదారులకు ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. ఇందులో 8198 గ్రౌండింగ్​ కాగా 7204 బేస్‌మెంట్ లెవల్లో ఉన్నాయి. కొన్ని వివిధ దశల్లో ఉండగా 222 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. 

101 మందికి బిల్లుల నిలిపివేత 

ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన వారిలో అనర్హులు ఉన్నారని హౌసింగ్ డిపార్ట్​మెంట్​కు సమాచారం అందింది. దీంతో ప్రజాపాలన అప్లికేషన్లను తిరిగి వెరిఫికేషన్​ చేస్తున్నారు. రూల్స్​ ప్రకారం కారు ఉన్నవారు ఈ స్కీమ్​కు అనర్హులు. 93 మందికి కార్లు ఉన్నాయని తేలింది. దీంతో అప్పటికే రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ బిల్లులు వచ్చినా ఆ తర్వాతి బిల్లులను నిలిపివేశారు. ఈ స్కీమ్​లో 8 మంది అవుట్​ సోర్సింగ్​ ఎంప్లాయిస్​ ఇండ్లు నిర్మిస్తున్నారని తేలడంతో వారికి కూడా బిల్లులు నిలిచిపోయాయి.

గతంలో ఇందిరమ్మ స్కీమ్​లో ఇండ్లు నిర్మించుకున్న వారిలో బేస్‌మెంట్ వరకూ నిర్మించుకొని, ప్రస్తుత స్కీమ్​లో లబ్దిదారుడిగా ఎంపికైనా బిల్లులు వస్తున్నాయి. గోడలు, రెంటల్​ లెవల్​ నిర్మాణం వరకూ బిల్లులు తీసుకున్న వారికి నిలిచిపోయాయి.

ఉమ్మడి కుటుంబానికి..

ఉమ్మడి కుటుంబంలో స్లాబ్​ఇల్లు ఉన్నా వారికి సైతం బిల్లులు ఆగిపోనున్నాయి. అప్లికేషన్లలో తమకు ఇండ్లు లేవని పేర్కొనడంతో ఇండ్లు శాంక్షన్​ అయ్యాయి. దీంతో ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన వారికి ఒకటి రెండు బిల్లులు వచ్చిన తర్వాత రావడం లేదు. దీనిపై విచారణ నిర్వహించగా ఉమ్మడి కుటుంబానికి స్లాబ్​ ఇల్లు ఉండడం వల్ల ఆగిపోయాయని తేలింది. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్న ఉమ్మడి కుటుంబంలో తర్వాత బిల్లులు వచ్చే అవకాశముంది.