దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు 

దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు 
  •      చింతల్​కుంటలో భారీగా ట్రాఫిక్​జామ్
  •     లింగంపల్లి ఆర్వోబీని ముంచెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు

హైదరాబాద్/ఎల్బీనగర్/మాదాపూర్, వెలుగు : గ్రేటర్ సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్​నగర్, ఉప్పల్, ఆర్సీపురం, మల్కాజిగిరిలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6.88, చందానగర్​లో 5.80, హయత్ నగర్ లో 5.68 సెంటీమీటర్ల వాన పడింది. దాదాపు గంటన్నరపాటు వర్షం కురవగా, రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీలోని ఇండ్లను వరద ముంచెత్తింది. వనస్థలిపురం నుంచి చింతలకుంట వరకు విజయవాడ నేషనల్​హైవేపై మోకాల్లోతు నీరు నిలిచింది. ట్రాఫిక్​స్తంభించి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరు వైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెహికల్స్​ఆగిపోయాయి. అంబులెన్స్ లు చిక్కుకున్నాయి.

మూడు కార్లు వరదలో మునిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది డివైడర్ తో పాటు రోడ్డు తవ్వి వరద నీటిని కాలానీల్లోకి పంపించారు. దీంతో అఖిమాబాద్, ఆగమయ్య నగర్ కాలనీల్లోని రోడ్లు వాగులను తలపించాయి. మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీ, ఆర్ కే పురం డివిజన్ యాదవ నగర్ కాలనీలోకి భారీగా వరద చేరింది. ఎల్ బీ నగర్ సిరీస్ రోడ్డులో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.

లింగంపల్లిలోని రైల్వే గేటు వద్ద నడుములోతు నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పార్సిగుట్టలో మోకాళ్లలోతున నీరు చేరింది. ఎల్బీనగర్, హయత్ నగర్, లింగంపల్లి, బేగంపేట, దిల్ సుఖ్​నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల కోసం 37 ఫిర్యాదులు అందాయి.