గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు క్యాష్ రూపంలో చెల్లింపులు పూర్తిగా రద్దు చేసారు. అయితే ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ప్రాపర్టీ ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఆన్లైన్ లో మాత్రమే చెల్లింపులు చేయాలని ప్రజలకు సూచించింది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను కేవలం ఆన్‌లైన్ లేదా నాన్-క్యాష్ పద్ధతుల్లోనే చెల్లించాలి. చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చు.
నగర పరిధిలోకి కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలు, ప్రాంతాల్లో కూడా ఈ కొత్త విధానం వర్తిస్తుంది. గతంలో ఈ ప్రాంతాల్లో నగదు చెల్లింపులు ఉన్నప్పటికీ, ఇకపై గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఒకే విధమైన పన్ను వసూలు విధానం అమలు చేయనున్నారు.
డిజిటల్ గవర్నెన్స్‌ను పటిష్టం చేయడంలో భాగంగా తీసుకున్న ఈ కొత్త విధానానికి నగర ప్రజలు సహకరించాలని GHMC కోరింది. అలాగే పన్ను చెల్లింపుదారులు లావాదేవీలకు సంబంధించిన రసీదులను వెంటనే ఆన్‌లైన్ ద్వారా పొందే వీలుంటుందని కూడా గుర్తుచేసింది.
