దక్షిణాది సినిమాలు ప్రపంచ స్థాయిలో గర్జిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తూ.. ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటున్నాయి. అలాంటిది సౌత్ హీరోయిన్లు మాత్రం బాలీవుడ్ లో నెగ్గుకురావడంమంటే అగ్ని పరిక్షే. అక్కడ రాణించిడం సంగతి పక్కన పెడితే.. కనీస గౌరవం దక్కించుకోవడం కూడా కష్టమని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి రెజీనా కసాండ్రా.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
బాలీవుడ్‌లో 'సౌత్' చిన్నచూపు
16 ఏళ్లకే సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన రెజీనా.. తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. రవితేజ, సాయి దుర్గా తేజ్, సందీప్ కిషన్ వంటి స్టార్లతో నటించి 'హిట్' హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నాక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌పై కన్నేసింది. అయితే, అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాలు మాత్రం చేదు జ్ఞాపకాలను మిగిల్చాయని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
హిందీ భాషపై నాకు పూర్తి పట్టు ఉంది. నేను హిందీ రాయగలను, అనర్గళంగా మాట్లాడగలను. ఇతర హీరోయిన్లలా డబ్బింగ్ ఆర్టిస్టుల సహాయం లేకుండా నా పాత్రలకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను. అయినా సరే, బాలీవుడ్‌లో నేను పూర్తిగా కలిసిపోలేకపోయాను. దానికి కారణం నా టాలెంట్ కాదు, నేను 'సౌత్ ఇండియన్' అనే ముద్ర" అని ఆవేదన వ్యక్తం చేసింది రెజీనా.
అవమానకర ప్రవర్తన..
తన బాలీవుడ్ ప్రయాణం గురించి మరిన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది రెజీనా. దక్షిణాది నుంచి వచ్చిన నటీనటులను కొందరు చాలా తక్కువ చేసి చూస్తారని, వారి మాట తీరు అసౌకర్యంగా ఉంటుందని పేర్కొంది. కేవలం మాటలతోనే కాదు, ప్రవర్తనతో కూడా నన్ను వారు కించపరిచిన సందర్భాలు ఉన్నాయి. నా నేపథ్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడేవారు. అది చూసి నాలో ఒక రకమైన భయం, సందేహం మొదలైంది అని చెప్పుకొచ్చింది. అయితే, పరిశ్రమ మొత్తం చెడ్డది కాదని, తనకు మద్దతుగా నిలిచిన వారు, గౌరవించిన వారు కూడా ఉన్నారని ఆమె స్పష్టం చేసింది.
సౌత్ టూ నార్త్
2019లో సోనమ్ కపూర్ నటించిన 'ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా, ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల వైపు మళ్లింది. 'రాకెట్ బాయ్స్', 'ఫర్జీ' , 'జాట్', 'కేసరి చాప్టర్ 2' వంటి హిట్ సిరీస్‌లలో తన నటనతో మెప్పించింది. అయినప్పటికీ, బాలీవుడ్‌లో తనపై ఉన్న 'రీజనల్' ముద్ర కారణంగా అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేదని ఆమె భావిస్తోంది. రెజీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఒకవైపు ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు బాలీవుడ్ మార్కెట్‌ను ఏలుతుంటే, మరోవైపు నటీమణులకు ఇంకా వివక్ష ఎదురవ్వడం విచారకరం అని సినీ ప్రియులు పోస్ట్ చేస్తున్నారు.. ప్రస్తుతం రెజీనా చేతిలో 'మూకుత్తి అమ్మన్ 2' వంటి ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి.
