సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న తెలుగు నటి శోభిత ధూళిపాళ్ల. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా ఎదిగింది. అయితే, సెలబ్రిటీ హోదాను అనుభవించే విషయంలో ఆమె రూటే వేరు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలో నడిచే PR వ్యవస్థపై శోభిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
పీఆర్ మాయాజాలం నాకు సెట్ కాదు..
ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న హీరో, హీరోయిన్ అయినా సరే.. నిత్యం వార్తల్లో ఉండటానికి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి భారీగా ఖర్చు చేసి పీఆర్ టీమ్స్‌ను మెయింటైన్ చేస్తారు. కానీ శోభిత మాత్రం దీనికి పూర్తి భిన్నం. నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. వైజాగ్ నుంచి ముంబైకి వెళ్లి ప్రతి విషయాన్ని స్వయంగా నేర్చుకున్నాను. నాకు పీఆర్ వ్యవస్థ అస్సలు సెట్ కాదు. 24 గంటలూ అందరికీ కనిపిస్తూ ఉండాలి, జనం నా గురించే మాట్లాడుకోవాలి అనే తపన నాకు లేదు అని ఆమె కుండబద్దలు కొట్టింది.
నా దారి నాదే..
పరిశ్రమలో రాణించాలంటే కొన్ని నియమాలు పాటించాలని, అందరితో టచ్‌లో ఉండాలని చాలామంది చెబుతుంటారు. దీనిపై శోభిత స్పందిస్తూ.. రూల్స్ తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు నాలో ఏం నచ్చుతుందో నాకు అనవసరం, కానీ నా గురించి నాకు బాగా తెలుసు. నా వ్యక్తిగత విషయాలపై నాకు క్లారిటీ ఉంది, అందుకే నాకు కృత్రిమ ప్రచారాలు అక్కర్లేదు అని స్పష్టం చేసింది శోభిత.
వైజాగ్ బ్యూటీ టూ గ్లోబల్ స్టార్
మేజర్, గూఢచారి సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న శోభిత, హిందీలో 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్‌తో జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది. ఇటీవల విడుదలైన హారర్ థ్రిల్లర్ 'చీకటిలో' సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. కేవలం వెండితెరపైనే కాకుండా, అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా ఆమె రాణిస్తోంది. అక్కినేని నాగచైతన్యతో పెళ్లి తర్వాత .. కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది.
