వాలెంటైన్స్ డేను భార్యతో కలిసి ఆనందంగా జరుపుకున్నాడు. సాయంత్రం సరదాగా అలా ఇద్దరూ కలిసి బయటకెళ్లారు. షికారు చేశారు. ఎంజాయ్ చేశారు. నైట్ ఇద్దరూ కలిసి వాలెంటైన్ నైట్ డిన్నర్ చేశారు. ఇద్దరూ ప్రేమలో మునిగి తేలిపోయారు. కానీ.. అలాంటి తనకు అదే భర్త రూపంలో చావు పొంచి ఉందని ఆ వివాహిత కలలో కూడా ఊహించలేకపోయింది. అప్పటి వరకూ భార్యతో అంత సంతోషంగా గడిపిన అదే భర్త ఆమెను గొంతు కోసి చంపేశాడు.
తమపై ఒక దారి దోపిడి ముఠా అటాక్ చేసిందని.. ఆ దోపిడి దొంగలు తన భార్య గొంతు కోసి చంపేశారని కట్టు కథ అల్లి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఈ కేసులో అసలు నేరస్తుడైన భర్తను హత్య జరిగిన 18 గంటల్లో అరెస్ట్ చేశారు. ఈ మర్డర్ మిస్టరీని 24 గంటల్లోపే సాల్వ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన హర్యానాలోని గురుగ్రాంలో వెలుగుచూసింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్షుల్ ధావన్, మహక్ 2025 సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. అన్షుల్ సొంతూరు హిస్సార్. మహక్ సొంతూరు ఝాన్సీ. మహక్ HDFC బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా, అన్షుల్ చార్టర్డ్ అకౌంటెంట్గా గురుగ్రాంలో వర్క్ చేస్తున్నాడు. గత ఆదివారం 11 గంటల సమయంలో అన్షుల్ పోలీసులకు కాల్ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు తమ దగ్గర ఉన్న డబ్బు, బంగారం దోచుకున్నారని.. ప్రతిఘటించబోయిన క్రమంలో తన భార్య గొంతు కోశారని కాల్ చేసి పోలీసులకు చెప్పాడు.
అన్షుల్ కాల్ చేసిన కాసేపటికి పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. పోలీసులు క్రైం సీన్ లో దారి దోపిడి జరిగిన ఆనవాళ్లు ఏవీ కనిపించకపోవడంతో అనుమానమొచ్చింది. పోలీసులు అన్షుల్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అన్షుల్ నిజం కక్కాడు. మహక్ క్యారెక్టర్పై తనకు ఎప్పటి నుంచో అనుమానం ఉందని.. ఆ అనుమానం కారణం గానే ఇద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగాయని.. తన భార్యను చంపేశానని అన్షుల్ పోలీసులకు చెప్పాడు. అన్షుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
