లండన్: బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత సంతతికి చెందిన యువ సంచలనాలు బోధనా శివానందన్, శ్రేయస్ రాయల్ చరిత్ర సృష్టించారు. ఆదివారం కోవెంట్రీలో ముగిసిన 2026 బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్‌లో 11 ఏళ్ల బోధనా మహిళల టైటిల్‌ను కైవసం చేసుకోగా.. 17 ఏళ్ల శ్రేయస్ ఓవరాల్ బ్రిటిష్ చాంపియన్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల త్రిషా కన్యామరాలాతో జరిగిన ఉత్కంఠభరిత ర్యాపిడ్ ప్లేఆఫ్‌లో బోధనా విజయం సాధించింది.
దీంతో బ్రిటన్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో మహిళల చెస్ చాంపియన్‌గా నిలిచింది. ఇప్పటికే యూకే ఓపెన్ మహిళల బ్లిట్జ్ చాంపియన్, జాయింట్ బ్రిటిష్ మహిళల ర్యాపిడ్ చాంపియన్‌గా ఉన్న బోధనా.. క్లాసికల్ టైటిల్‌తో హ్యాట్రిక్ ఘనత సాధించింది. ఈ టోర్నీలో ఆరో రౌండ్‌లో శ్రేయస్ చేతిలో మాత్రమే ఆమె ఓడింది. మరోవైపు తొమ్మిది రౌండ్ల తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన శ్రేయస్.. అనుభవజ్ఞులైన ఇంగ్లండ్ గ్రాండ్‌మాస్టర్లను వెనక్కి నెట్టి తొలిసారి బ్రిటిష్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
భారత్‌లో జన్మించిన శ్రేయస్ మూడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి బ్రిటన్‌కు వెళ్లాడు. 15 ఏళ్లకే ఇంగ్లండ్‌లో అత్యంత పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించాడు. 122 ఏళ్ల బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఈసారి రికార్డు స్థాయిలో 1,750 మందికి పైగా పోటీపడ్డారు. ఓపెన్ విభాగంలో రికార్డు స్థాయిలో 34 వేల పౌండ్ల ప్రైజ్‌మనీని ప్రకటించారు.
