ఆస్పత్రి పోస్ట్ మార్టం గదిలో మందు పార్టీ ఏంట్రా.. దెయ్యాలు కూడా భయపడే ప్లేస్ అది..

ఆస్పత్రి పోస్ట్ మార్టం గదిలో మందు పార్టీ ఏంట్రా.. దెయ్యాలు కూడా భయపడే ప్లేస్ అది..

మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న యశ్వంతరావు చవాన్ మెమోరియల్ (YCM) ఆసుపత్రిలో ఒక ఘటన  పెద్ద చర్చకు దారితీసింది. ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం గదిలో విధుల్లో ఉన్న డాక్టర్  మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి  డాక్టర్ వైభవ్ అవినాష్ మస్కేను వెంటనే సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, ఆయనపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.

సమాచారం ప్రకారం  ఏం జరిగిందంటే... గురువారం రాత్రి ఒక వ్యక్తి మరణించిన తన కుటుంబికుడికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ తీసుకోవడానికి YCM ఆసుపత్రికి వెళ్లాడు. డెత్ సర్టిఫికెట్ కోసం ఆసుపత్రి బయట రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో అతను పోస్ట్‌మార్టం గది లోపలికి చూడగా, అక్కడ విధుల్లో ఉన్న డాక్టర్  మద్యం సేవిస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ గదిలో ఆహార పదార్థాలతో  ఒక బల్ల, మద్యం సీసా కనిపిస్తున్నాయి. ఈ ఘటనను వీడియో తీసి పోస్ట్ చేయడంతో  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వీడియో బయటకు రావడంతో ఆసుపత్రి నిర్వహణపై, విధుల్లో ఉన్న సిబ్బంది ప్రవర్తనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా, చనిపోయిన వారి కుటుంబికులు  బాధలో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం మరింత ఆందోళన కలిగించింది.

అధికారుల స్పందన.. వెంటనే నోటీసులు
ఈ ఘటనపై పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కుల్దీప్ జంగం స్పందించారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారు. అంటే, ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేసే వరకు వేచి ఉండకుండా, వార్త లేదా వీడియో ఆధారంగా ఆయనే విచారణ  ప్రారంభించారు.

Also Read : రాజస్థాన్ కోటాలో జేఈఈ విద్యార్థుల మధ్య ఘర్షణ..

మొదటగా సంబంధిత వైద్యుడితో పాటు అక్కడి సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై   లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆ వివరణ కూడా అదే రోజు సాయంత్రంలోగా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

డాక్టర్ పై సస్పెన్షన్ వేటు
ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తూ.. మున్సిపల్ కమిషనర్ విజయ సూర్యవంశీ ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో  డాక్టర్ వైభవ్ అవినాష్ మస్కేను వెంటనే  సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రవర్తన మహారాష్ట్ర సివిల్ సర్వీసెస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని  పేర్కొంది. అయితే, సస్పెన్షన్ అనేది చర్య మాత్రమే. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి, ఆరోపణలకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం ఆయన మరో ఉద్యోగం లేదా వ్యాపారం చేపట్టకూడదని ఆదేశించారు.

ఈ ఘటన ఆసుపత్రుల్లో విధుల పట్ల బాధ్యత, వైద్య వృత్తిలో నైతిక విలువలు, రోగుల కుటుంబాలకు అందాల్సిన సేవల ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేస్తోంది.