ఈరోజు (ఫిబ్రవరి 17) జరిగిన సీబీఎస్‌ఈ (CBSE) 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుండి రకరకాల ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బేసిక్ పేపర్ రాసిన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాధారణంగా స్టాండర్డ్ పేపర్ కష్టంగా, బేసిక్ పేపర్ ఈజీగా ఉండాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. స్టాండర్డ్ పేపర్ బాగున్నా, బేసిక్ పేపర్ మాత్రం చాలా కష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
బేసిక్ పేపర్ (సెట్ 430/2/2) చాలా కష్టంగా వచ్చిందని, మా స్థాయికి మించి ప్రశ్నలు అడిగారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని మరికొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులు పేపర్ కష్టంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా కేస్ స్టడీ ప్రశ్నలు, గ్రాఫ్ ప్రశ్నలు చుక్కలు చూపించాయని చెబుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే :
పేపర్లు రెండూ ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సిలబస్ ప్రకారమే ఉన్నాయని, అయితే ప్రశ్నలు అడిగే విధానం మారిందని టీచర్లు చెబుతున్నారు. కేవలం బట్టీ పట్టడం కాకుండా, విషయాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారో పరీక్షించేలా సామర్థ్య ఆధారిత (Competency-based) ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) సులభంగానే ఉన్నా, వాటిని సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
