కన్న బిడ్డను పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. పైగా.. రోడ్డు ప్రమాదాల్లాంటి దుర్ఘటనల్లో బిడ్డలు ప్రమాదవశాత్తూ చనిపోతే తల్లిదండ్రుల కడుపు కోత జీవితాంతం వెంటాడుతుంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ కొడుకును కోల్పోయిన భార్యాభర్త ఆ బాధను తట్టుకోలేక.. కొడుకు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఎందుకు చనిపోయారనే విషయంలో స్పష్టత ఇచ్చి మరీ ఈ దంపతులు ప్రాణం తీసుకున్నారు. వీడియో రికార్డ్ చేసి.. నాలుగు పేజీల నోట్ రాసి.. చీరను తాడులా చేసుకుని ఇంటి వెనుక పక్క ఉన్న చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన ఫిబ్రవరి 16న జరిగింది.
కృష్ణ పటేల్ (48), రమా బాయి (47) దంపతులకు ఆదిత్య పటేల్ (21) ఒక్కడే కొడుకు. ఆదిత్యనే వారి ప్రపంచం. కొడుకుకు ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. కృష్ణ పటేల్ వృత్తి రీత్యా మేస్త్రీ. రమా బాయి గృహిణి. 2024లో మస్తూరి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ ఆదిత్య చనిపోయాడు. ఈ ఘటనను గుర్తుచేసుకుని.. కొడుకును తల్చుకుని కృష్ణ పటేల్, రమా బాయి కుమిలిపోయేవారు. బాధపడని రోజంటూ లేదు. ఈ ట్రామా నుంచి భార్యాభర్త బయటపడలేకపోయారు. ఫిబ్రవరి 16న ఉరేసుకుని చనిపోయారు.
ఇరుగుపొరుగుకు ఈ విషయం ఎలా తెలిసిందంటే.. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఏదైనా ఊరు వెళ్లారా అంటే ఇంటికి తాళం వేసి కూడా లేదు. రోజులు గడుస్తుంది. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. అనుమానం వచ్చి చూస్తే.. ఇంటి తలుపు లోపల వైపు గడియ పెట్టి ఉంది. భార్యాభర్తల్లో ఇద్దరిని పేర్లతో పిలిచినా ఎవరూ బయటకు రావడం లేదు. ఏ స్పందనా లేకపోవడంతో కిటికీ తీసి చూశారు. భార్యాభర్త ఇద్దరూ ఇంటి వెనుక పక్క ఉన్న చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు బాధితుల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోను, నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
