- గతంలో బేస్ మెంట్ కట్టి వదిలేసిన వాళ్లకు అవకాశం
- ఉమ్మడి రాష్ట్రంలో, గత ప్రభుత్వంలో కట్టి ఆపిన లబ్ధిదారులకూ సాయం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు స్టార్ట్ చేసి.. బేస్ మెంట్ కట్టి వదిలేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై నేడో రేపో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు హౌసింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఈ తరహా లబ్ధిదారులు 9 వేల మంది ఉన్నట్టు అధికారుల సర్వేలో వెల్లడైంది. వారికి బేస్ మెంట్ సాయం రూ. లక్ష మినహాయించి మిగతా రూ.4 లక్షల సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా ఇండ్లు మంజూరై బేస్ మెంట్ కట్టగానే ప్రభుత్వం మారటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం అందించలేదు.
గత ప్రభుత్వంలో సైతం ఎన్నికలు జరిగే ముందు గృహలక్ష్మి స్కీమ్ ను లాంఛ్ చేసింది. ఇండ్లు లేని లబ్ధిదారులకు రూ.3 లక్షలు సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బేస్ మెంట్ స్టార్ట్ చేసే సమయానికి ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రభుత్వం సాయం అందించలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇందిరమ్మ స్కీమ్ లో భాగంగా గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా లబ్ధిపొందిన వాళ్లను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది ఉండగా వీరికి ఇందిరమ్మ ఇండ్లు దక్కనున్నాయి.
