మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటనలో రాకేష్ అనే కానిస్టేబుల్ గాయాలపాలయ్యాడు. గాయాల పాలైన కానిస్టేబుల్ను కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అలాగే.. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలపాలైన జావిద్ ఖాన్ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. జావిద్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ రణరంగంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వం శీకృష్ణ కాన్వాయ్పై బీఆర్ఎస్, సీపీఐ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్ అఫీషియో ఓటు వేయడానికి మున్సిపల్ ఆఫీస్కు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు పగిలాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్రాఫిక్ కోన్ డివైడర్లు విసిరి హల్చల్ చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాకేశ్, కాంగ్రెస్ కార్యకర్త జావీద్, మరో కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి బీఆర్ఎస్, సీపీఐ లీడర్లు కార్యకర్తలను చెదరగొట్టారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రాంతం రణరంగంలా మారింది. పోలీసులు వెంటనే మంత్రి, ఎంపీకి రక్షణగా ఉంటూ ఘటనా స్థలం నుంచి మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. మంత్రి వెంటే వచ్చిన 8 మంది కౌన్సిలర్లు ఎన్నిక జరిగే హాలులోకి ప్రవేశించారు. అంత కుముందు 14 మంది బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. ము న్సిపల్ ఆఫీసు వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
