- ఏసు ప్రభువు బతికిస్తాడని ప్రార్థనలు
- హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఘటన
కూకట్పల్లి, వెలుగు: ఏసు ప్రభువు వచ్చి మృతదేహానికి ప్రాణం పోస్తాడని కుటుంబ సభ్యులు డెడ్ బాడీని నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని రామకృష్ణా నగర్ లో ఈ ఘటన జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన ఏసురత్నం పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. తన కుటుంబంతో కొన్ని సంవత్సరాలుగా కూకట్పల్లిలోని రామకృష్ణానగర్లో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. కొన్నేండ్ల క్రితం ఏసురత్నం చనిపోయారు. ఆయన భార్య శమంతకమణి, కొడుకు జయరాం, కూతుర్లు సునీత, శైలజ కలిసి నివసిస్తున్నారు. నలభై ఏండ్లు దాటినా జయరాం, సునీత, శైలజకు పెండ్లి కాలేదు. సునీత, శైలజ కూడా తమ తల్లి వద్దే ఉంటున్నారు.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన శైలజను స్థానిక రాందేవ్రావు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స సమయంలో కూడా వీరు ఆసుపత్రి సిబ్బందికి సహకరించలేదు. రక్తహీనతతో బాధపడుతున్న శైలజకు రక్తం ఎక్కించాలని డాక్టర్లు చెబితే అందుకు నిరాకరించారు. పరిశుద్ధమైన రక్తమైతేనే ఎక్కించాలని పట్టుబట్టారు. ఈనెల 13న శైలజ చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకువచ్చి ఇంట్లోనే ఉంచి ప్రార్థనలు చేస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారి ఇంటికి చేరుకుని తలుపులు తీయాలని చెప్పినా వినలేదు. వినకపోతే తలుపులను బద్దలుకొట్టి మునిసిపాలిటీ సిబ్బందితో మృతదేహాన్ని తరలిస్తామని చెప్పడంతో చివరకు తలుపులు తెరిచారు. పోలీసులు నచ్చచెప్పడంతో శైలజ బాడీని తమ స్వగ్రామానికి తరలించారు.
