ఐటీ లేఆఫ్స్‌తో తగ్గిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు.. డైలమాలో కొనుగోలుదారులు

ఐటీ లేఆఫ్స్‌తో తగ్గిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు.. డైలమాలో కొనుగోలుదారులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ప్రాపర్టీ అమ్మకాల జోరుకు ఐటీ రంగంలో వస్తున్న లేఆఫ్స్, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు బ్రేకులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ నిపుణులపై ఆధారపడిన గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో కొనుగోలుదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ల తగ్గుదల..
హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరిలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 14 శాతం క్షీణించి 4వేల 686 యూనిట్లకు పరిమితమయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 5వేల 465గా ఉండేది. కేవలం అమ్మకాల సంఖ్యే కాకుండా.. లావాదేవీల విలువ కూడా 16 శాతం మేర తగ్గడం గమనించదగిన విషయం. గతంలో సైట్ విజిట్ చేసిన కొద్ది రోజుల్లోనే నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఇప్పుడు తమ ఆదాయ భద్రతపై స్పష్టత కోసం నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఒకవేళ లేఆఫ్ అయితే కట్టాల్సిన హోమ్ లోన్ ఈఎంఐల పరిస్థితి ఏంటనే భయాలు చాలా మంది టెక్కీలను వెంటాడుతున్నాయి. 

ALSO READ : కోటివిటీ ఆఫీస్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లాపై ప్రభావం..
హైదరాబాద్ రియల్టీకి ఇంజిన్‌లాంటి రంగారెడ్డి జిల్లాలో హై-వాల్యూ లావాదేవీలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది జనవరిలో జిల్లా వాటా 41 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు 34 శాతానికి పడిపోయింది. రూ.కోటి కంటే ఎక్కువ విలువైన ప్రీమియం ఇళ్ల విక్రయాల్లో 17 శాతం తగ్గుదల నమోదైంది. అయినప్పటికీ మార్కెట్ విలువలో 44 శాతం వాటాతో ఈ ప్రీమియం విభాగమే రియల్టీని నిలబెడుతోంది.

ALSO READ : టీసీఎస్, ఏఎండీ మధ్య కీలక ఒప్పందం

బెంగళూరు, గురుగ్రామ్ పరిస్థితి కూడా ఇదే..
హైదరాబాద్ మాత్రమే కాదు, ఇతర టెక్ నగరాలైన బెంగళూరు, గురుగ్రామ్లలో కూడా అమ్మకాలు మందగించాయి. ముందుగా బెంగళూరు విషయానికి వస్తే వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో అమ్మకాలు 5 శాతం మేర తగ్గాయి. అలాగే గురుగ్రామ్ లోని గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే పరిసరాల్లో కొనుగోలుదారులు బేరసారాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. జాబ్ సెక్యూరిటీ విషయంలో నెలకొన్న గందరగోళం వల్ల కొనుగోలుదారులు ఇప్పుడు ఎమోషనల్ నిర్ణయాల కంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది డిమాండ్ లేకపోవడం కాదు.. మార్కెట్ రీకాలిబ్రేషన్ మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా రెడీ-టు-మూవ్ ఇళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ.. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగువేస్తున్నారు. ఏఐ దెబ్బకు టెక్ ప్రపంచంలో పాత వైభవం తిరిగి వచ్చే పరిస్థితి అస్సలు కనిపించకపోవటం బిల్డర్లను కొంత ఆందోళనకు గురిచేస్తున్న మాట వాస్తవమే.