సంచలన సృష్టించిన సినీ నటీ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది ధర్మాసనం. హైకోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్ష తీర్పును సమర్ధించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది.
పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ కొట్టివేసింది ధర్మాసనం.
పురుగుల మందు తాగిన ప్రత్యూష
ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇంటర్మీడియట్ రోజుల నుండే ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 23, 2002న, వారు సాఫ్ట్ డ్రింక్లో పురుగుమందులు కలిపి సేవించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ప్రత్యూష మరుసటి రోజు మరణించింది. వైద్యులు ఆర్గానోఫాస్పేట్ విషప్రయోగాన్ని నిర్ధారించారు. ఊపిరాడకపోవడం ,దాడిని తోసిపుచ్చారు. అయినప్పటికీ ఆమె శరీరంపై ఉన్న గుర్తులను ప్రస్తావించిన కొన్ని ఫోరెన్సిక్ నోట్లు ఆమె తల్లి సందేహాలను మరింత పెంచాయి.ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మహత్యాయత్నం చేయడం వంటి నేరాలకు సిద్ధార్థ రెడ్డిని ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ALSO READ : నటి ప్రత్యూష కేసు ఏంటీ.. 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. ఆమె ఎలా చనిపోయింది..!
2011లో హైకోర్టు శిక్షను రెండు సంవత్సరాలకు తగ్గించి, జరిమానాను పెంచింది. సరోజినీదేవి ఈ తగ్గింపును సవాలు చేస్తూ, తన కుమార్తె సాధారణ ఆత్మహత్య ఒప్పందంలో చనిపోలేదని పట్టుబట్టింది. ఇద్దరూ కలిసి విషం సేవించినందున ఈ ప్రేరేపణ నిలబడదని సిద్ధార్థ రెడ్డి వాదించారు. బెయిల్ కోసం సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. రెండు దశాబ్దాలకు పైగా గడిచినా, ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఇవాళ తుది తీర్పు ఇచ్చింది.
