హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్‌చల్ చేశారు. నకిలీ తుపాకీతో బంగారం షాపు లూటీకి యత్నించారు. యజమానిని రాడ్‌తో కొట్టి బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. వివరాల ప్రకారం.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న బాలాజీ జ్యువెలరీ షాపులోకి శుక్రవారం (జనవరి 2) సాయంత్రం ఇద్దరు వ్యక్తులు కస్టమర్ల ముసుగులో చొరబడ్డారు.
షాప్‌లోకి రాగానే జ్యువెలరీ షాప్ యజమానికి టాయ్ గన్ (డమ్మీ గన్) చూపించి చంపేస్తామని బెదిరించారు. షాప్‌లో ఉన్న బంగారు బాక్స్‌లను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో యాజమాని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన దుండగులు వెంట తెచ్చుకున్న గొడ్డలి లాంటి ఆయుధంతో షాప్ ఓనర్ తలపై బలంగా కొట్టడంతో అతడు కుప్పకూలిపోయాడు. అదే అదునుగా భావించిన నిందితులు సుమారు నాలుగు తులల బంగారం ఎత్తుకెళ్లారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. డీసీపీ రమణారెడ్డి, ఎస్‌ఓటీ డీసీపీ శ్రీధర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణారెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులు విడిచిపెట్టిన డమ్మీ గన్, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. సీసీటివి ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశామని తెలిపారు.
