నేను ఇంటికి పోతా.. మమ్మల్ని పంపించండి: కోల్‎కతాలో చిక్కుకున్న డారెన్ సామీ ఆవేదన

నేను ఇంటికి పోతా.. మమ్మల్ని పంపించండి: కోల్‎కతాలో చిక్కుకున్న డారెన్ సామీ ఆవేదన

న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్‎లో విమాన రాకపోకలు స్తంభించిపోయాయి. టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు మిడిల్ ఈస్ట్‎లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐదు రోజులుగా కోల్‎కతాలోనే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసిన సామీ.. తనకు ఇంటికి వెళ్లాలనుందని పేర్కొన్నాడు. 

అసలు ఏం జరుగుతుందో మాకు ఏదైనా అప్డేట్ ఇవ్వండి.. ఇవాళా, రేపా లేక ఇంకో వారమా ఎప్పుడూ వెళ్తామో చెప్పండని కోరాడు. ఇప్పటికే ఐదు రోజులు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ నిష్ర్రమించిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ 8 రౌండ్‎లో భాగంగా ఇండియాతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‎లో వెస్టిండీస్ ఓటమి పాలై ఇంటి దారి పట్టింది. కరేబియన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ ఐదు రోజులుగా ఇక్కడే చిక్కుకుపోయారు. 

►ALSO READ | T20 World Cup: ఇంగ్లాండ్పై భారత్ గెలవడం కష్టం.. పాక్ మాజీ క్రికెటర్ బోల్డ్ ప్రెడిక్షన్

 మిడిల్ ఈస్ట్‎లో యుద్ధ పరిస్థితుల వల్ల విమాన రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో వెస్టిండీస్ ప్లేయర్ తమ సొంత దేశం వెళ్లేందుకు వీలు లేకుండాపోయింది. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్ క్రికెటర్స్ ను సొంత దేశానికి తరలించేందుకు ఐసీసీ చర్యలు చేపట్టినట్లు ESPNcricinfo నివేదించింది. కోల్‌కతా నుంచి లండన్ మీదుగా కరేబియన్ దీవులకు వెళ్లేలా చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో వెస్టిండీస్ క్రికెటర్స్ తమ స్వస్థలాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.