పాట్నా: బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దాదాపు రెండు దశాబ్ధాలుగా బీహార్ రాజకీయాలను శాసిస్తోన్న ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్టేట్ పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్య సభ సభ్యుడిగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తోన్నట్లు తెలిపారు. దీంతో బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ శకం ముగినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదిలా ఉంటే.. నితీష్ కుమార్ తర్వాత బీహార్ సీఎం ఎవరనే చర్చ ఆ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేండ్లుగా బీహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోన్న బీజేపీ పొత్తులు, వివిధ సమీకరణాలతో సీఎం సీటు మాత్రం దక్కించుకోలేకపోతుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకుంటుండటంతో ఈ సారి మాత్రం ఎలాగైనా సీఎం సీటు దక్కించుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
బీహార్‌కు బీజేపీ వ్యక్తే నెక్ట్స్ సీఎంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే కమలం పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పీఠం కోసం బీజేపీలో తీవ్రంగా పోటీ నెలకొంది. ఆశావహులు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా 8 మంది కీలక నేతలు సీఎం రేసులో ఉన్నారు. వారు ఎవరు..? వారి నేపథ్యం ఏంటో ఓ సారి పరిశీలిద్దాం..
1. సామ్రాట్ చౌదరి: బీహార్ బీజేపీలో సామ్రాట్ చౌదరి కీలక నేత. ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఈయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ సీఎం రేసులో సామ్రాట్ చౌదరి పేరు ముందు వరుసలో ఉంది. సీఎంగా ఈయన పేరు దాదాపు ఖరారైనట్లేనని కమలం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాట్ చౌదరి తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్‌ను 45,843 ఓట్ల ఆధిక్యంతో ఓడించి ఆ స్థానాన్ని గెలుచుకున్నారు.
2. నిత్యానంద్ రాయ్ : ప్రస్తుతం ఈయన కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. బీహార్‌లోని ఉజియార్‌పూర్ నుండి ఎంపీగా గెలుపొందారు. బీహార్ సీఎం రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది.
►ALSO READ | నా మాటలు గుర్తు పెట్టుకోండి.. అమెరికా బాధ పడే రోజులు వస్తయ్: యుద్ధనౌక దాడిపై ఇరాన్ మంత్రి వార్నింగ్
3. విజయ్ కుమార్ సిన్హా: నితీష్ కుమార్ కేబినెట్లో సామ్రాట్ చౌదరితో పాటు విజయ్ కుమార్ సిన్హా బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 నుంచి లఖిసరాయ్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తు వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం విజయ్ కుమార్ సిన్హా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
4. సంజీవ్ చౌరాసియా: ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఈయన కూడా ఉవ్విళ్లూరుతున్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దిఘా నియోజకవర్గం నుంచి సంజీవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (CPI-ML) అభ్యర్థి దివ్య గౌతమ్‌ను 59,079 ఓట్ల తేడాతో చిత్తు చేశారు.
5. నితీష్ మిశ్రా: మధుబని జిల్లాలోని ఝంఝర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రా 52,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. నితీష్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండటంతో బీజేపీ కోటాలో సీఎం సీటు పై ఈయన ఆశలు పెట్టుకున్నారు.
6. దిలీప్ జైస్వాల్: బీహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న ఈయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్ నుంచి పోటీ చేశారు. హై కమాండ్ పెద్దలతో ఉన్న పరిచయాలతో సీఎం సీటు కోసం దిలీప్ జైస్వాల్ లాబీయింగ్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
7. రామ్ కృపాల్ యాదవ్: ప్రస్తుతం ఈయన బీహార్ వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. గతంలో ఎంపీగా పని చేశారు. ముఖ్య మంత్రి పదవిపై ఈయన కూడా ఆశలు పెట్టుకున్నారు.
8.జనక్ రామ్: బీహార్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఆయన గోపాల్‌గంజ్ నుండి లోక్‌సభ మాజీ సభ్యుడు. సీనియర్ లీడర్ కోటాలో బీహార్ సీఎం రేసులో ఈయన కూడా ఉన్నారు.
