నా మాటలు గుర్తు పెట్టుకోండి.. అమెరికా బాధ పడే రోజులు వస్తయ్: యుద్ధనౌక దాడిపై ఇరాన్ మంత్రి వార్నింగ్

నా మాటలు గుర్తు పెట్టుకోండి.. అమెరికా బాధ పడే రోజులు వస్తయ్: యుద్ధనౌక దాడిపై ఇరాన్ మంత్రి వార్నింగ్

టెహ్రాన్: శ్రీలంక తీరం హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐర్ఐఎస్ దేనాను అమెరికా పేల్చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి స్పందించారు. ఇరాన్ తీరాలకు 2 వేల నాటికల్ మైళ్ల దూరంలో హిందు మహా సముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ఐర్ఐఎస్ దేనాపై దాడి చేసి అమెరికా దారుణ చర్యకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దాదాపు 130 మంది సిబ్బందితో భారత నావికాదళానికి అతిథిగా ఉన్న ఫ్రిగేట్ దేనాను అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి హెచ్చరిక లేకుండానే ముంచేశారని మండిపడ్డారు. నా మాటలు గుర్తు పెట్టుకోండి.. అమెరికా తాను చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాపడుతుందని హెచ్చరించారు.

అమెరికా, ఇజ్రాయెల్‎తో యుద్ధంలో ఇరాన్‎కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఇరాన్ అత్యాధునిక యుద్ధనౌక 'ఐఆస్ఐఎస్ దేనా'ను హిందూ మహాసముద్రంలో అమెరికా ముంచేసింది. సముద్రగర్భంలో సైలెంట్‎గా సబ్ మెరైన్ నుంచి టార్పెడోతో అటాక్ చేసి పేల్చేసింది. 

►ALSO READ | కెనడాలో ఇండియన్ యూట్యూబర్ దారుణ హత్య.. ఖలిస్తాన్ను వ్యతిరేకించినందుకేనా..?

అమెరికా దాడి సమయంలో యుద్ధనౌకలో 180 మంది సిబ్బంది ఉండగా.. 87 మంది మృతిచెందారు. 32 మందిని శ్రీలంక నేవీ కాపాడగా, మరో 61 మంది గల్లంతయ్యారు. బుధవారం ఉదయం శ్రీలంకకు దక్షిణాన గాలే నగరం వద్ద తీరానికి 40 నాటికల్ మైళ్ల దూరంలోని ఇంటర్నేషనల్ జలాల్లో ఈ దాడి ఘటన జరిగింది.

ఇరాన్ యుద్ధనౌకను తామే పేల్చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. దీనిని ఆయన 'క్వైట్ డెత్(నిశ్శబ్ద మరణం)' అని అభివర్ణించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. అమెరికా ఒక శత్రు దేశపు నౌకను 'టార్పెడో' (నీటి అడుగున ప్రయోగించే మిసైల్)తో ముంచేయడం ఇదే మొదటిసారి అని తెలిపారు.