కెనడాలో భారత సంతతి యూట్యూబర్ ను దారుణంగా హత్య చేశారు దుండగులు. పంజాబ్ మూలాలున్న యట్యూబర్ నాన్సీ గ్రెవాల్ (45) మార్చి 3న ఒంటారియోలోని విండ్సోర్ లో హత్యకు గురైంది. నిత్యం పంజాబ్ సమస్యలపై స్పందించే గ్రెవాల్ చనిపోవడం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచేసింది.
లసల్లే పోలీస్ సర్వీస్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. లోకల్ టైమ్ రాత్రి 9.30 గంటలకు (మార్చి 03) టాడ్ లేన్ లోని 2400 బ్లాక్ లో ఈ ఘటన జరిగింది. కత్తితో దారుణంగా పొడిచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కత్తి గాయాలతో విలవిలలాడుతున్న గ్రెవాల్ ను.. ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలపై ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. గతంలో జైలుకెళ్లిన అమ్రిత్ పాల్ సింగ్, అకాలీదల్ లీడర్ బిక్రమ్ సింగ్ మజితియా, డేరా బియాస్ హెడ్ గురిందర్ సింగ్ ధిల్లాన్ మొదలైన వారిపై ఆమె మాట్లాడింది.
అంతే కాకుండా ఖలిస్తానీల నిరసనలను ఆమె ఖండించింది. ఖలిస్తాన్ వివాదంతో ఇండియా-కెనడా మధ్య దెబ్బతిన్న సంబంధాల గురించి చెబుతూ.. ఖలిస్తాన్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే విధంగా బతిండాలో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి (కమల్ కౌర్ భాభీ) హత్యకు వ్యతిరేకంగా గళం విప్పింది.
